ప్రతి పైసాను ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి….

415
- Advertisement -

నగదురహిత లావాదేవీల రాష్ట్రంగా తెలంగాణను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం వివిధ సంస్థలకు, వ్యక్తులకు ప్రతి పైసాను ఆన్‌లైన్‌లోనే చెల్లించాలని, అలాగే ప్రభుత్వానికి జరిగే చెల్లింపులను కూడా ఆన్‌లైన్‌లోనే స్వీకరించాలని రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో నిర్ణయించారని తెలిసింది. ఆర్టీసీ బస్సులలో టికెట్లు ఇచ్చేందుకు స్వైపింగ్ మిషన్లు, మొబైల్ యాప్‌లను వినియోగించాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం శనివారం మధ్యాహ్నం సచివాలయంలో జరిగింది. నగదు రహిత విధానం అమలుచేసేందుకు టీ వ్యాలెట్‌ను రూపొందించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ఈ మేరకు టీ వ్యాలెట్ రూపకల్పనకు, నగదు రహిత లావాదేవీల నిర్వహణకు విధివిధానాలు రూపొందించడానికి పురపాలక, పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. దీనిలో సభ్యులుగా మంత్రులు ఈటల రాజేందర్, జగదీశ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావులతో పాటు ప్రత్యేక ఆహ్వానితులుగా డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ ఉంటారు. అలాగే అధికారులతో టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటుకు కూడా మంత్రిమండలి ఆమోదం తెలిపిందని సమాచారం.

TS Cabinet

నగదు రహిత లావాదేవీల నిర్వహణకు తెలంగాణ చేస్తున్న కృషికి దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు క్యాబినెట్ సమావేశంలో తెలిపారని విశ్వసనీయవర్గాలు చెప్పాయి. నగదురహిత గ్రామంగా ఇబ్రహీంపూర్‌ను తీర్చిదిద్దేందుకు చేపట్టిన కృషిని అభినందిస్తున్నారని సీఎం వివరించారని తెలిసింది. ఇటీవల తాను ప్రధానిని మోదీని కలిసినప్పుడు దేశంలో తెలంగాణ మాదిరిగా నగదు రహిత లావాదేవీలపై ఇప్పటివరకు ఏ రాష్ట్రమూ కృషిచేయలేదని తనతో అన్నారని సమావేశంలో కేసీఆర్ తెలిపారని సమాచారం. తెలంగాణ చేపట్టిన ఈ చర్యలు దేశానికి ఆదర్శమని ప్రధాని కొనియాడడంపట్ల మంత్రివర్గ సమావేశం హర్షం వ్యక్తంచేసినట్లు తెలిసింది. కొన్ని ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా నగదురహిత విధానాన్ని ముందుకు తీసుకువెళ్లాలని క్యాబినెట్ నిర్ణయించిందని విశ్వసనీయవర్గాలు పేర్కొన్నాయి. అయితే ప్రజలకు నగదు కష్టాలు ఎంతకాలం ఉంటాయో చెప్పలేమని సీఎం అన్నట్లు తెలిసింది. నోట్ల రద్దుపై కేంద్రం వెనక్కు తగ్గే పరిస్థితి లేదని, అలాంటప్పుడు నగదు రహితంపై మనం ముందుకు వెళ్లడమే సరైందని, వీలైనంతవరకు ప్రజలకు అవగాహన కలిగించాలని, చైతన్యం చేయాలని, తద్వారా ప్రజలను నగదు రహిత లావాదేవీల వైపుకు తీసుకువెళ్లాలని సీఎం చెప్పినట్లు తెలిసింది.

పెద్ద నోట్ల రద్దు విషయంలో పెద్ద పెద్ద ఆర్థికవేత్తలే భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారని సీఎం కేసీఆర్ క్యాబినెట్‌కు వివరించారని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కూడా తప్పకుండా తగ్గుతుందని, అయితే ఇది ఎంత తగ్గుతుందో ఇప్పుడే అంచనాకు రాలేమని, అంచనాకు రావడానికి కొంత సమయం పడుతుందని చెప్పారని తెలుస్తున్నది.

TS Cabinet

ప్రతి ప్రశ్నకు సమాధానం ఈ నెల 16 నుంచి నిర్వహించనున్న అసెంబ్లీ సమావేశాలను హుందాగా నడిపించాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించిందని సమాచారం. కనీసం 15 పనిదినాలకు తక్కువ కాకుండా సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు తెలిసింది. విపక్షాలు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు సభను నడిపిద్దామని, ఇన్ని రోజులే సభను నడపాలన్న నిబంధనతో మనం ఎందుకు ఉండాలని సీఎం కేసీఆర్ మంత్రివర్గ సమావేశంలో వ్యాఖ్యానించారని విశ్వసనీయవర్గాలు చెప్పాయి. విపక్షం, స్వపక్షం అనే భేదం లేకుండా సభ్యులు అడిగిన ప్రతి ప్రశ్నకు ప్రజల తరపున సమాధానం ఇవ్వాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ప్రజల ప్రభుత్వంగా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కూడా మనపై ఉందని సీఎం అన్నారని, ప్రతిపక్షంకోసం కాకుండా ప్రజల కోసం సభను నడుపుదామని చెప్పారని తెలిసింది.

అధికారులంతా సమగ్ర సమాచారంతో సిద్ధంగా ఉండాలని, మంత్రులంతా తమ తమ శాఖలపై పూర్తి పట్టుతో, సమగ్ర సమాచారంతో ఉండాలని, మంత్రులు తమ శాఖల అధికారులతో సమావేశమై అధ్యయనం చేయాలని కోరారని సమాచారం. రెండున్నరేండ్లలో తెలంగాణలో చేపట్టిన పథకాలు, ప్రాజెక్టులు, వాటి అమలు తీరును లెక్కలతో సహా వివరించాలని సీఎం కేసీఆర్ తన మంత్రివర్గ సహచరులకు దిశానిర్దేశం చేశారని తెలుస్తున్నది.

TS Cabinet
ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు రూపకల్పనకు విధి విధానాలు రూపొందించడానికి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నేతృత్వంలో మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటుచేస్తూ మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుందని సమాచారం. ఈ కమిటీలో మంత్రులు కేటీ రామారావు, పోచారం శ్రీనివాసరెడ్డి, జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, జోగు రామన్న, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ సభ్యులుగా ఉంటారని తెలిసింది.

కృష్ణా జలాల పంపిణీ విషయంలో బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణకు సరైన వాటా రాలేదని అభిప్రాయపడిందని సమాచారం. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణకు అన్యాయం జరిగిందని క్యాబినెట్ అభిప్రాయపడిందని తెలుస్తున్నది. కృష్ణా జలాలపై బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చిన తరువాత మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ మంత్రివర్గ సమావేశానికి ముందు శనివారం ఉదయం కూడా సచివాలయంలో సమావేశమై క్యాబినెట్‌కు పలు సిఫారస్సులు చేస్తూ నివేదికను ఇచ్చింది. సబ్‌కమిటీ కూడా సుప్రీంకోర్టుకు వెళ్లాలనే అభిప్రాయాన్ని వెలిబుచ్చిన నేపథ్యంలో మంత్రివర్గ సమావేశం దీనిపై సుదీర్ఘంగా 45 నిమిషాలపాటు చర్చించి సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్పీ వేయాలని నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇందులో సుప్రీం కోర్టే తెలంగాణకు మార్గం చూపించాలని కోరనున్నారు. కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణకు కృష్ణా నీటిలో వాటా ఉండాలని కోరనున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా జలాల్లో తెలంగాణకు హక్కు కావాలని పోరాడామని, కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణకు హక్కు కావాలని, ఈ మేరకు దారి చూపించాలని సుప్రీంను కోరాలని నిర్ణయించినట్లు తెలిసింది.

పెద్దఎత్తున చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులకు కావాల్సిన భూసేకరణకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేంద్రం తీసుకువచ్చిన 2013 భూసేకరణ చట్టాన్ని అడాప్ట్ చేసుకుంటూనే రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన కొన్ని సవరణల బిల్లుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని అధికారవర్గాలు తెలిపాయి. 123 జీవో కూడా చట్టంలో పేర్కొనే విధంగా 2013 చట్టానికి సవరణలతో కూడిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. అలాగే వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ పేరును పీవీ నరసింహారావు యూనివర్సీటీగా మారుస్తూ బిల్లును అసెంబ్లీలో పెట్టాని మంత్రివర్గ సమావేశం నిర్ణయించిందని తెలిసింది.

TS Cabinet

ప్రభుత్వం తక్షణ నిర్ణయాల అమలుకోసం అప్పటికప్పుడు ఆర్డినెన్స్‌లు తీసుకువస్తుంటుంది. క్యాబినెట్ ఆమోదం తరువాతనే ఆర్డినెన్స్‌లు అమల్లోకి వస్తాయి. అయితే వాటిని ఆరు నెలల్లో అసెంబ్లీలో బిల్లు రూపంలో ప్రవేశపెట్టి సభ ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఆర్డినెన్స్‌లకు బిల్లు రూపం ఇవ్వడానికి మరోసారి మంత్రివర్గ సమావేశం ముందుకు తీసుకువచ్చేలా ఇప్పటి వరకు బిజినెస్ రూల్స్ ఉన్నాయి. వీటిపై విస్తృతంగా చర్చించిన మంత్రివర్గ సమావేశం.. ఆర్డినెన్స్ ఆమోదం కోసం క్యాబినెట్‌లో చర్చ జరుగుతుందని, ఆ తరువాత నేరుగా అసెంబ్లీకి వెళితే సరిపోతుందని, మరోసారి క్యాబినెట్ ఆమోదం అవసరం లేదని నిర్ణయించిందని తెలిసింది. ఈ మేరకు బిజినెస్ రూల్స్ మారుస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

వివిధ శాఖల్లో పని ఆధారంగా కొత్త పోస్టులు ఏర్పాటు చేయడానికి మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపిందని సమాచారం. ఈ మేరకు డిప్యూటీ సెక్రటరీ (డీఎస్), అసిస్టెంట్ సెక్రటరీ (ఏఎస్), సెక్షన్ ఆఫీసర్ (ఎస్‌వో), అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏఎస్‌వో) పోస్టులు అందుబాటులోకి రానున్నట్లు తెలిసింది. ఇదే సమయంలో కొన్ని శాఖలలో సిబ్బంది ఉన్నారు కానీ సరిపడా పనిలేదని, అలాంటి వారి సేవలను పని ఉన్న శాఖలలో వినియోగించుకోవాలని సీఎం అన్నట్లు తెలిసింది. ముఖ్యంగా వికలాంగుల శాఖలో సిబ్బంది ఎక్కువగా ఉన్నారని, కానీ పనిలేదని గుర్తించారు. శాఖల పేరుతో అలా ఉంచడం సరికాదని సీఎం అన్నారని సమాచారం.

- Advertisement -