సీఎం కేసీఆర్ అధ్యక్షతన సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసిన విషయం తెలిసిందే. మంత్రివర్గ భేటీ వివరాలను ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి మీడియా ద్వారా వెల్లడించారు. సమావేశంలో చర్చించిన ప్రధాన అంశాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
– భాషా పండితులు, పీఈటీల విజ్ఞప్తిపై చర్చించిన మంత్రివర్గం 2487 భాషా పండితులు, 1047 పీఈటీలను స్కూల్ అసిస్టెంట్స్‌గా అప్‌గ్రేడ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
– మహిళా ఉద్యోగులకు 90 రోజులు చైల్డ్ కేర్ లీవులు మంజూరు. పిల్లలకు 18 సంవత్సరాలు వచ్చే వరకు 90 రోజుల సెలవులు ఆరు దఫాలుగా ఎప్పుడైనా వాడుకోవచ్చు.
– ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన పరిపాలన భవనాలను తెలంగాణకు కేటాయించాలని గవర్నర్‌ను కోరుతూ తీర్మానం.
– ప్రజల అభీష్టం మేరకు ఆరు జిల్లాల పేర్లు మార్పు. కుమరం భీం ఆసిఫాబాద్, యాదాద్రిభువనగిరి, భద్రాద్రికొత్తగూడెం, జోగులాంబగద్వాల, రాజన్నసిరిసిల్ల, జయశంకర్‌భూపాలపల్లిగా పేర్లు మార్పు.
– విశ్వవిద్యాలయాల్లో విద్యాప్రమాణాలు పెంచేందుకు ఉప ముఖ్యమంత్రి కడియం నేతృత్వంలో కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటుకు నిర్ణయం.
– మత్స్య సంపద, గొర్రెల పెంపకంపై మంత్రి తలసాని నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం.
అదేవిధంగా మంత్రివర్గ సమావేశంలో ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, రైతు మూడో విడత రుణమాఫీపై చర్చ జరిగినట్లు తెలిపిన మంత్రి కడియం నెల రోజుల్లో బకాయిలను క్లియర్ చేయాలని సీఎం ఆదేశించినట్లు పేర్కొన్నారు.
బ్రిజేష్ ట్రిబ్యునల్‌పై చర్చ జరిగింది. ఇంకా లోతుగా అధ్యయనం చేసేందుకు క్యాబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు, తుమ్మల నాగేశ్వరరావు, జగదీష్ రెడ్డి, జూపల్లి కృష్ణరావులు ఉంటారు. ప్రత్యేక ఆహ్వనితులుగా డిప్యూటి సీఎం కడియం శ్రీహరి, నీరంజన్ రెడ్డిలు ఈ కమిటీలో ఉన్నారు. ఈ కమిటీ బ్రిజేష్ కమిటీ తీర్పును స్టడీ చేయనుంది. తెలంగాణ రావాల్సిన కృష్ణ నీళ్ల గురించి స్టడీ చేయనుంది.
తెలంగాణలోని యూనివర్సిటీలకు మళ్లీ పూర్వవైభవం తీసుకురావడానికి తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి మరొక క్యాబినేట్ సబ్‌కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీకి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చైర్మన్‌గా.. ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మా రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, ఆర్ ఆండ్ బీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ లు సభ్యులుగా ఉంటారు.