చికెన్ ఫ్రై.. ఇలా ట్రై చేయండి!

73
- Advertisement -

మాంస ప్రియులకు చికెన్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. కొందరికైతే చికెన్ లేనిదే ముద్ద దిగని పరిస్థితి.. ఇక చికెన్ తో అటు రెస్టారెంట్లలోనూ, ఇటు మన ఇళ్లలోనూ రకరకాల వంటలు తయారు చేస్తుంటారు. సాధారణంగా చికెన్ తో చేసిన కర్రిస్, లేదా పులుసు వంటివి ఒకరోజు కంటే ఎక్కువ నిల్వ ఉండవు. కానీ ఇప్పుడు చెప్పే చికెట్ ఫ్రై ఒకరోజు నుంచి రెండు రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఈ చికెన్ ఫ్రై ఎంతో క్రిస్పీగా ఎంతో రుచిగా తిన్నవారికి సరికొత్త అనుభూతిని పంచుతుంది. మరి ఈ క్రిస్పీ చికెన్ ఫ్రైని ఎలా తయారు చేయాలో చూద్దామా !

ముందుగా ఒక కేజీ మీడియం సైజ్ చికెన్ ముక్కలను తీసుకొని, ఇందులో ఒక టి స్పూన్ పసుపు, ఒక టి స్పూన్ ఉప్పు, ఓ టేబుల్ స్పూన్ తాజా అల్లం పేస్ట్ వేసి ముక్కలకు మసాలాలు బాగా పట్టించాలి. ముక్కలకు మసాలాలు బాగా పట్టించిన తరువాత ఒక గంటసేపు ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్ లో ఉంచండి లేదా నీటిలో నానబెట్టండి. ఆ తరువాత దీన్ని అలా పక్కన పెట్టేసి చికెన్ ఫ్రై కోసం కేజీ చికెన్ కు సరిపడా రెండు టేబుల్ స్పూన్ల దానియాలు, అరా టి స్పూన్ మిరియాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, అయిదు యాలకలు, ఆరు లేదా ఏడు లవంగాలు మరియు ఒకటిన్నర ఇంచుల దాల్చిన చెక్క వేసి స్టౌవ్ పైన మంట మీడియం లో ఉంచి మంచి సువాసన వచ్చే వరకు వీటిని వేగానివ్వాలి. .

దినుసులన్నీ వేగిన తరువాత అరకప్పు ఎండు కొబ్బెర తురుము, ఓ టేబుల్ స్పూన్ గసగసాలు వేసి కొబ్బరి రంగు మారే వరకు మిశ్రమాన్ని బాగా వేగానివ్వాలి.ఆ తర్వాత ఈ మసాలా దినుసులన్నీ వేరే పాత్ర లోనికి తీసుకొని చల్లారిన తరువాత పొడి చేసుకోవాలి. వీటిని అలా పక్కన ఉంచుకొని ముందుగా పక్కన పెట్టుకున్న నానుతున్న చికెన్ లో ముప్పావు కప్పు నీరు పోసి కుక్కర్ కు మూత పెట్టి కేవలం హై ఫ్లెమ్ లో కుక్కర్ నుంచి రెండు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. చికెన్ కుక్ అయిన తరువాత అందులో మిగిలిన నీరును సూప్ గా నైనా తయారు చేసుకోవచ్చు లేదా బయట పారవేయవచ్చు. ఇప్పుడు కళాయి లో 60ఎం‌ఎల్ అయిల్ వేసుకొని అందులో జీడిపప్పు వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగానివ్వాలి. ఆతరువాత మిగిలిన నూనెలో మూడు రెబ్బల కరివేపాకు, అర టీ స్పూన్ తాజా అల్లం వెల్లుల్లి ముద్ద వేసి బాగా వేపాలి.

అల్లం వెల్లుల్లి ముద్ద వేగిన తరువాత మొదట కుక్ అయిన చికెన్ ముక్కలను అందులో వేసి చికెన్ కు ఉన్న నీరు ఆవిరి అయ్యి అయిల్ సపరేట్ అయ్యేంతా వరకు హై ఫ్లెమ్ లో కుక్ చేయాలి. ఆ తరువాత మంటను కాస్త తగ్గించి లో ఫ్లెమ్ లో ఉంచి చికెన్ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. దాదాపు 18 నిముషాల తరువాత చికెన్ ముక్కలు బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తరువాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడ ఉప్పు వేసి.. ఇంకా మొదట గ్రైండ్ చేసుకున్నా మసాలా పొడి మరియు వేపుకున్న జీడిపప్పు వేసి మరో మూడు నుంచి అయిదు నిముషాల పాటు మంటను మీడియం ఫ్లెమ్ లో ఉంచి కారం మాడిపోకుండా కలుపుతూ ఆ తరువాత చికెన్ ముక్కలను వేరే పాత్రలోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. అంతే ఎంతో రుచికరమైన క్రిస్పీ గా ఉండే చికెన్ ఫ్రై సింపుల్ గా ఈ విధంగా చేసుకోవచ్చు.

Also Read:బన్నీ ఎపిసోడ్‌..చిరు సీరియస్!

- Advertisement -