అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెక్సాస్‌లోని డల్లాస్‌లో భారత సంతతి వ్యక్తి చంద్ర మౌలి “బాబ్” నాగమల్లయ్య హత్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వారం ఆయనను కత్తితో దాడి చేసి, భార్య మరియు టీనేజ్ కుమారుడి ముందే నరికి చంపిన ఘటన అమెరికా అంతటా సంచలనం రేపింది.
నిందితుడు 37 ఏళ్లకు చెందిన క్యూబా జాతీయుడు యోర్డానిస్ కోబోస్-మార్టినెజ్. వాషింగ్ మెషిన్ వివాదం నేపథ్యంలో నాగమల్లయ్యపై దాడి చేసినట్లు డల్లాస్ పోలీసులు వెల్లడించారు. హత్య అనంతరం పరారయ్యే ప్రయత్నం చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి, బెయిల్ లేకుండా జైలులో ఉంచారు.
ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో స్పందిస్తూ, “డల్లాస్‌లో గౌరవనీయుడైన వ్యక్తి, మన దేశంలో ఉండకూడని అక్రమ వలసదారుడి చేతిలో దారుణంగా హతమయ్యాడు” అని అన్నారు. ఇకపై ఇలాంటి నేరస్తులపై “జీరో టాలరెన్స్” విధానాన్ని అమలు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ వ్యక్తి గతంలో బాలలపై లైంగిక దాడులు, వాహన దొంగతనం, తప్పుడు నిర్బంధం వంటి నేరాలకుగాను అరెస్టయ్యాడు. కానీ క్యూబా స్వదేశానికి తిరిగి తీసుకోవడానికి నిరాకరించడంతో, బైడెన్ నిర్లక్ష్యం వల్ల విడుదలయ్యాడు అని ట్రంప్ ఆరోపించారు.
హ్యూస్టన్‌లోని భారత కాన్సులేట్ జనరల్ డి.సి. మంజునాథ్ స్పందిస్తూ, “మృతుడి కుటుంబానికి అవసరమైన అన్ని రకాల సహాయం అందిస్తున్నాం” అని తెలిపారు. నాగమల్లయ్య భార్య నిషా, 18 ఏళ్ల కుమారుడు గౌరవ్ గోఫండ్‌మీ ద్వారా ఇప్పటివరకు సుమారు 2 లక్షల డాలర్లు సేకరించారు. ఈ నిధులు అంత్యక్రియల ఖర్చులు, గౌరవ్ కాలేజీ చదువుల కోసం వినియోగించనున్నారు.
Also Read:‘మిరాయ్’కి అద్భుత స్పందన

