మధ్యప్రాచ్యంలో అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు మళ్లీ ఊపందుకున్నాయి. ఇందులో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ఖతార్ ప్రధానమంత్రి షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్‌రహ్మాన్ అల్ థానీతో భేటీ కానున్నారు. వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు ఖతార్ కొత్త ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
అమెరికా-ఇరాన్ మధ్య చర్చల్లో ఖతార్ కీలక మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించి, యుద్ధానికి దౌత్యపరమైన పరిష్కారం కనుగొనడమే లక్ష్యంగా ఈ ప్రతిపాదనలు రూపొందించినట్లు అసోసియేటెడ్ ప్రెస్ వెల్లడించింది. వైట్‌హౌస్‌లోని ఓవల్ కార్యాలయంలో ట్రంప్, ఖతార్ ప్రధానమంత్రి సమావేశం కానున్నారు.
మరోవైపు ఇరాన్‌పై యుద్ధానికి సంబంధించి అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణ్వాయుధ ఆశయాల నుంచి ప్రపంచాన్ని రక్షించేందుకే అధ్యక్షుడు ట్రంప్ యుద్ధ నిర్ణయం తీసుకున్నారని సమర్థించారు. ఈ నిర్ణయం ప్రజాదరణ పొందకపోయినప్పటికీ, దేశ భద్రత దృష్ట్యా అవసరమని పేర్కొన్నారు.
ALso Read:దమ్ముంటే రా..రేవంత్‌కి ఎర్రబెల్లి సవాల్!
పారిస్‌లో జరగనున్న జీ7 విదేశాంగ మంత్రుల సమావేశానికి వెళ్లే ముందు ఫ్లోరిడాలో రూబియో ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ భద్రతకు సంబంధించిన కఠినమైన సవాళ్లను ఎదుర్కోవడం కొన్నిసార్లు ప్రజాదరణ పొందకపోవచ్చని, అయినప్పటికీ సరైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఇటీవల జరిగిన మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఆశించిన ఫలితాలు సాధించకపోవడంపై ట్రంప్ స్పందించారు. అమెరికా ప్రజల్లో ఇజ్రాయెల్ పట్ల పెరుగుతున్న వ్యతిరేకత కూడా తమ పార్టీ పనితీరుపై ప్రభావం చూపిందని అభిప్రాయపడ్డారు.

