భారత్‌ పై ట్రంప్ విద్వేషం!

16
- Advertisement -

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన నోటికి పని చెప్పారు. వలసల విషయంలో తనకున్న కఠిన వైఖరిని ప్రదర్శించే క్రమంలో, భారతదేశాన్ని “నరకం” (Hellhole) తో పోలుస్తూ అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమవ్వడమే కాకుండా, భారతీయ సమాజం నుండి తీవ్ర నిరసనలకు దారితీస్తున్నాయి.

డొనాల్డ్ ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’ (Truth Social) లో ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. ఆ పోస్ట్‌లో అమెరికాలో అమల్లో ఉన్న ‘బర్త్ రైట్ సిటిజన్ షిప్’ (పుట్టుకతో వచ్చే పౌరసత్వం) మరియు వలస విధానాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు.

విదేశీయులు అమెరికాకు వచ్చి పిల్లలను కనడం ద్వారా ఆ పిల్లలు మొదట అమెరికా పౌరులుగా మారుతారని, ఆ తర్వాత వారు ‘చైన్ మైగ్రేషన్’ ద్వారా తమ కుటుంబ సభ్యులందరినీ “చైనా, భారత్ లేదా మరేదైనా నరకం (Hellhole)” నుంచి ఇక్కడికి తీసుకొస్తున్నారని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇతర దేశాల నుంచి వచ్చే వలసదారుల వల్ల అమెరికాకు ముప్పు పొంచి ఉందనే తన పాత వాదనను బలపర్చడానికి ఆయన ఈ పదజాలాన్ని ఉపయోగించారు.

భారత్‌ను “నరకం”గా అభివర్ణించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వలసల విషయంలో భారత్‌పై ట్రంప్ తనకున్న విద్వేషాన్ని మరోసారి బయటపెట్టారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థలో మరియు సాంకేతిక రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న భారతీయ అమెరికన్లను ఈ వ్యాఖ్యలు తీవ్రంగా కించపరిచేలా ఉన్నాయని ప్రవాస భారతీయులు మండిపడుతున్నారు.

ఒకవైపు భారత్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెబుతూనే, మరోవైపు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రెండు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలపై ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.గతంలో కూడా పర్యావరణం మరియు వాణిజ్య విషయాల్లో భారత్‌పై ట్రంప్ పలుమార్లు విమర్శలు గుప్పించారు. అయితే, ఏకంగా ఒక దేశాన్ని “నరకం” అని సంబోధించడంపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.

- Advertisement -