ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు కావాలి:ట్రంప్

2
- Advertisement -

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రష్యా నుంచి డీజిల్ కొనుగోలు చేయాలన్న అమెరికా నిర్ణయాన్ని జెలెన్‌స్కీ విమర్శించడంతో ట్రంప్ ఎదురుదాడికి దిగారు. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమని వ్యాఖ్యానించారు. ఈ పరిణామంతో వాషింగ్టన్‌, కీవ్‌ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

రష్యాతో యుద్ధం కొనసాగుతున్న సమయంలో ఆ దేశం నుంచి ఇంధనం కొనుగోలు చేయడంపై అమెరికా, ఉక్రెయిన్ మధ్య విభేదాలు బయటపడ్డాయి. రష్యా నుంచి డీజిల్ కొనుగోలు చేయడం ఆ దేశం చేస్తున్న యుద్ధానికి పెట్టుబడి పెట్టడమేనని జెలెన్‌స్కీ విమర్శించారు. దీనిపై స్పందించిన ట్రంప్.. రష్యాతో యుద్ధాన్ని ముగించేందుకు జెలెన్‌స్కీ తగిన ప్రయత్నాలు చేయడం లేదని ఆరోపించారు.

2022 ఫిబ్రవరిలో ప్రారంభమైన యుద్ధాన్ని ముగించేందుకు జెలెన్‌స్కీకి అనేక అవకాశాలు వచ్చినప్పటికీ, ఆయన ఒప్పందాలకు ముందుకు రావడం లేదని ట్రంప్ విమర్శించారు. రష్యా ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు ఆపాలని పలుమార్లు కోరినా ఉక్రెయిన్ వాటిని కొనసాగిస్తోందని ఆరోపించారు.

ఒప్పందం కుదుర్చుకోగల కొత్త నాయకుడిని ఎన్నుకోవాలని నేను సూచిస్తున్నాను. ఆయనకు అనేక ఒప్పందాలు చేసుకునే అవకాశాలు వచ్చాయి. కానీ, కొన్ని కారణాల వల్ల వాటిని ఎప్పుడూ ముందుకు తీసుకెళ్లడం లేదు. ప్రపంచానికి సమస్యలు సృష్టించాలని చూస్తున్నారు. మన రైతులకు, వ్యవసాయ రంగానికి, డీజిల్ ఇంధన సరఫరాకు కూడా ఇబ్బందులు కలిగిస్తున్నారు అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

Also Read:బీసీ రిజర్వేషన్లపై ఏపీ సర్కార్‌

ఉక్రెయిన్ తన భూభాగంలో 30 శాతం కోల్పోయిందని, యుద్ధంలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారని ట్రంప్ పేర్కొన్నారు. ఈ యుద్ధం అసలు ప్రారంభం కావాల్సింది కాదు. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు రావాల్సిన సమయం ఆసన్నమైందని నేను భావిస్తున్నాను అన్నారు.

- Advertisement -