రెండేళ్ల గడువు..ఆ తర్వాత 200% పన్నులా?

1
- Advertisement -

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ఒక కీలక ప్రకటన చేశారు. విదేశాల నుంచి దిగుమతి అయ్యే జనరిక్ ఔషధాలపై రాబోయే రెండేళ్ల పాటు ఎటువంటి సుంకాలు ఉండవని అయితే ఆ తర్వాత కూడా కంపెనీలు ఉత్పత్తిని అమెరికాకు తరలించకుండా విదేశాల్లోనే కొనసాగిస్తే ఆ దిగుమతులపై మొదట 100 శాతం, ఆ తర్వాత 200 శాతం వరకు భారీ సుంకాలు విధిస్తామని హెచ్చరించారు.

స్వదేశీ తయారీ రంగానికి ఊపిరిపోసి..విదేశీ ఔషధాలపై అమెరికా ఆధారపడటాన్ని తగ్గించాలనే ట్రంప్ విస్తృత వ్యూహంలో ఇది భాగం. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద జనరిక్ ఔషధ సరఫరాదారులలో ఉంటూ అమెరికాను తన అతిపెద్ద ఎగుమతి మార్కెట్‌గా భావించే భారత్‌పై దీని ప్రభావం తీవ్రంగా ఉండనుంది.

రాబోయే రెండేళ్లపాటు జనరిక్ ఔషధాలపై 0% పన్ను ఉంటుందని, ఈ సమయంలో ఔషధ కంపెనీలు తమ తయారీ యూనిట్లను అమెరికాకు మార్చుకోవాలని ట్రంప్ స్పష్టం చేశారు. ఆ గడువు పూర్తయ్యాక, 100% నుంచి ప్రారంభమై 200% వరకు దిగుమతి సుంకాలు పెరుగుతాయి. భారత్, చైనా వంటి దేశాల నుంచి ఔషధాలను దిగుమతి చేసుకోవడానికి బదులుగా, కంపెనీలు అమెరికాలోనే ఆ ఉత్పత్తులు చేసేలా ప్రోత్సహించడమే ఈ నిర్ణయం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే, ఈ ప్రతిపాదన ఇంకా అధికారిక విధానపరమైన రూపుదాల్చాల్సి ఉంది కాబట్టి భవిష్యత్తులో నిబంధనల్లో కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉంది.

అమెరికాలో వినియోగించే యాంటిబయోటిక్స్, మధుమేహం (షుగర్), క్యాన్సర్ వంటి నిత్యం అవసరమయ్యే జనరిక్ ఔషధాలలో అధిక భాగం భారత్ నుంచే సరఫరా అవుతున్నాయి. తక్కువ ఖర్చుతో భారత్‌లో తయారుచేసి అమెరికాకు ఎగుమతి చేయడమే ప్రాతిపదికగా భారత ఫార్మా రంగాలు పనిచేస్తున్నాయి. ఒకవేళ ఇన్ని భారీ సుంకాలు అమల్లోకి వస్తే, అమెరికా మార్కెట్‌లో భారతీయ ఔషధాల ధరలు విపరీతంగా పెరిగి, పోటీ తత్వాన్ని కోల్పోతాయి.రాత్రికి రాత్రే భారీ పన్నులు విధిస్తే, అది అమెరికాలోనే తీవ్రమైన ఔషధ కొరతకు దారితీసి, ఆరోగ్య సంరక్షణ వ్యయాన్ని అమాంతం పెంచేస్తుంది.

అందుకే ఫార్మా కంపెనీలు తమ తయారీ కేంద్రాలను అమెరికాకు మార్చుకోవడానికి, అత్యవసర ఔషధాల కొరత రాకుండా చూసుకోవడానికి మరియు అమెరికా తన స్వదేశీ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి వీలుగా ఈ రెండేళ్ల మినహాయింపు గడువు ఉపయోగపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఎలక్ట్రానిక్స్ లేదా దుస్తుల తయారీ పరిశ్రమలను మార్చినంత సులభం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫార్మా పరిశ్రమల మార్పునకు కఠినమైన నిబంధనల ఆమోదాలు, ల్యాబ్ తనిఖీలు మరియు నూతన సరఫరా వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవడం ఎంతో శ్రమతో కూడుకున్నది.

Also Read:ఢిల్లీ హైకోర్టు తీర్పుపై సోనమ్ భార్య

భారతదేశానికి చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీల ఆదాయంలో గణనీయమైన భాగం అమెరికా మార్కెట్ నుంచే వస్తుంది. ముఖ్యంగా సన్ ఫార్మా ,డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్,అరబిందో ఫార్మా ,లూపిన్ ,జైడస్ లైఫ్‌సైన్సెస్,సిప్లా ,గ్లెన్‌మార్క్,టొరెంట్ ఫార్మా పై ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే అందరిపైనా ప్రభావం ఒకేలా ఉండదు. ఇప్పటికే అమెరికాలో తయారీ ప్లాంట్లు కలిగి ఉన్న కంపెనీలు లేదా పలు దేశాల్లో ఉత్పత్తి సౌకర్యాలున్న సంస్థలు.. కేవలం భారత్ నుంచే ఎగుమతులపై ఆధారపడే చిన్న కంపెనీల కంటే మెరుగైన స్థితిలో ఉంటాయి.

- Advertisement -