నియంతలా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు తాను చెప్పినట్లు వినాల్సిందేనంటూ ప్రపంచానికి ప్రమాద సంకేతాలు పంపుతున్నారు. అందుకు నిదర్శనంగా అమెరికాకు మిత్రదేశమైన ఆస్ట్రేలియాతో తగువు పెట్టుకున్నారు. గత నెలలో ఒబామా హయాంలో కుదుర్చుకున్న శరణార్థుల ఒప్పందంపై ఆస్ట్రేలియా ప్రధాని మాల్కం టర్న్‌బుల్‌తో వాగ్వాదానికి దిగి మధ్యలోనే ఫోన్ పెట్టేసిన సంగతి తెలిసిందే. తాజాగా ట్రంపు జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ తో భిన్నంగా వ్యవహరించారు. సుదీర్ఘకాలంగా ఐరోపాలోని అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థకు సారథ్యం వహిస్తున్న ఏంజెలా మెర్కెల్, అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ మధ్య ఇదే తొలిసమావేశం కావడంతో… ఇరు దేశాల మధ్య భవిష్యత్ సంబంధాలను నిర్ణయించే సమావేశంగా అందరూ భావించారు. అయితే భిన్నంగా ట్రంపు అధ్యక్ష స్థానంలో ఉండి పిల్ల చేష్టలు చేశారు.
జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ నిన్న అమెరికా పర్యటనకు వెళ్లారు. అధ్యక్ష నివాసం శ్వేతసౌధంలో ట్రంప్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం ట్రంప్, మెర్కెల్ సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆయన మెర్కెల్‌కు షేక్‌హ్యాండ్ ఇవ్వలేదు. ఫొటో కోసం విలేకరులు షేక్‌హ్యాండ్ ఇవ్వాలని అడిగినా స్పందించలేదు. దీంతో మెర్కెల్ స్వయంగా అడిగినా కూడా ఆయన ఏమాత్రం స్పందించకుండా అవమానపరిచారు. ట్రంప్ ప్రవర్తనకు ఆమె ఇబ్బందిపడుతూ చిన్నగా నవ్వారు. మెర్కెల్ వైట్‌హౌస్‌కు ఆహ్వానించే సమయంలో ట్రంప్ షేక్‌హ్యాండ్ ఇచ్చారు. కానీ అందరి ముందు అడిగినా ఇవ్వకపోవడం ఇబ్బందికరంగా మారింది. చివరికి మీడియా సమావేశం ముగిశాక గానీ ట్రంప్ మెర్కెల్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఓ దేశ నాయకురాలిని తొలిసమావేశంలోనే ఈ విధంగా అవమానించడంపై నెటిజన్లు ట్రంప్‌పై దుమ్మెత్తి పోస్తున్నారు.
విలేకరులు కరచాలనం కోసం అడిగారు కదా.. మెర్కెల్ తన చిన్న చేతుల్ని నలిపేస్తారేమోనని ట్రంప్ భయపడ్డారనుకుంటా అని కొందరు సోషల్ మీడియ వేదికగా వెక్కిరించారు. అధ్యక్ష స్థానంలో ఉండి పిల్ల చేష్టలు చేస్తున్నాడంటూ ట్వీట్లు చేశారు.