భారతీయులకు ట్రంప్ గుడ్ న్యూస్ అందించారు. ప్రతిభ ఆధారంగానే గ్రీన్ కార్డుల జారీకి అవకాశం కల్పించేలా ట్రంప్ ప్రకటన చేశారు. కేపిటల్ బిల్డింగ్‌లో ‘స్టేట్ ఆప్ ది యూనియన్’ అడ్రస్‌లో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు. నైపుణ్యం, శ్రమించే తత్త్వం, మన సమాజ అభివృద్ధికి కృషి చేసేవారిని, మన దేశాన్ని ప్రేమించి, గౌరవించేవారిని అనుమతించే విధానం రావాలన్నారు.
ట్రంప్ తాజా ప్రకటనతో ప్రతిభావంతులైన భారతీయులకు ప్రయోజనం చేకూరనుంది. తల్లిదండ్రులతో కలిసి బాల్యంలో అమెరికా వెళ్ళిన 18 లక్షల మంది చట్టవిరుద్ధ వలసదారులకు లబ్ధి చేకూరుతుంది. వీరికి ఉదారంగా పౌరసత్వం ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చినదాని కన్నా మూడు రెట్లు ఎక్కువ మందికి పౌరసత్వం ఇవ్వాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
నైపుణ్యాలున్న వ్యక్తులకు ప్రయోజనం చేకూరినప్పటికీ.. వారి తల్లిదండ్రులు, అత్తమామల్ని మాత్రం తీసుకెళ్లడం ఇక మీదట కుదరదు. చైన్ మైగ్రేషన్ విధానం ఉండబోదని ఈ చర్య దేశ ఆర్థిక వ్యవస్థ కోసం మాత్రమే కాదని, దేశ భద్రత, భవిష్యత్తు కోసం అవసరమని పేర్కొన్నారు. గతంలో కాన్సాస్‌లో కాల్పుల్లో మరణించిన కూచిబొట్ల శ్రీనివాస్ భార్య సునయన కూడా ట్రంప్ ప్రసంగ కార్యక్రమానికి హాజరయ్యారు.