ఇరాన్‌ ఒప్పందంపై ట్రంప్ మరో అనౌన్స్

2
- Advertisement -

ఇరాన్‌తో కుదిరిన కొత్త శాంతి ఒప్పందంపై కీలక ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. ఇరాన్ దేశం ఎప్పటికీ అణు ఆయుధాలను కలిగి ఉండబోనని అంగీకరించిందని వెల్లడించారు. ఈ కొత్త ఒప్పందం కింద అమెరికా ప్రభుత్వం ఇరాన్‌కు 300 మిలియన్ డాలర్లు చెల్లిస్తోందంటూ వస్తున్న వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు.

అవన్నీ డెమొక్రాట్లు ప్రచారం చేస్తున్న “ఫేక్ న్యూస్” అని తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా కొట్టిపారేశారు. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన ఈ అవగాహన ఒప్పందం (MoU) భవిష్యత్తు ద్వైపాక్షిక సంబంధాలకు ఒక నిబంధనావళిని నిర్దేశిస్తుంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ఈ ఒప్పందాన్ని సమర్థిస్తూ.. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకుండా అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు.

ఈ ఒప్పందం పూర్తిగా ఇరాన్ ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. ఇరాన్ తన వద్ద ఉన్న యురేనియం నిల్వలను తగ్గించుకుంటూ, అంతర్జాతీయ అణు తనిఖీలకు సహకరిస్తేనే దానికి ఆర్థిక ఆంక్షల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇరాన్‌కు ఎలాంటి నిధులు ముందస్తుగా విడుదల చేయలేదని…ఆ దేశం తన బాధ్యతలను నెరవేర్చిన తర్వాతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోకి అనుమతిస్తామని వాన్స్ స్పష్టం చేశారు.

Also Read:‘సింగ్ గీతం’పై ఎన్టీఆర్ ప్రశంసలు

ఇరు దేశాలు ఇప్పటికే డిజిటల్‌గా సంతకాలు చేయగా ఈ వారాంతంలో స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో అమెరికా, ఇరాన్, పాకిస్తాన్, ఖతార్ ప్రతినిధుల సమక్షంలో అధికారిక సంతకాల కార్యక్రమం జరగనుంది.ఈ ఒప్పందంపై ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ స్పందిస్తూ.. ఇది దేశానికి గర్వకారణమైన పత్రమని అభివర్ణించారు. కాగా ఈ ఒప్పందంతో సంబంధం లేకుండా, ఇరాన్‌ను ఎప్పటికీ అణ్వాయుధ దేశంగా ఎదగనివ్వబోమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. ఈ చారిత్రాత్మక ఒప్పందం పూర్తి పాఠాన్ని శుక్రవారం అధికారిక సంతకాల అనంతరం బహిరంగపరుస్తామని ట్రంప్ ప్రకటించారు.

- Advertisement -