బీజేపీకి చిత్తశుద్ధి లేదు: గెల్లు శ్రీనివాస్ యాదవ్

188
Gellu Srinivas yadav

ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు డిమాండ్ చేసే నైతిక హక్కు బీజేపీ, ఏబీవీపీ నాయకులకు లేదని టీఆర్ఎస్వీ ప్రెసిడెంట్‌ గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కడారి స్వామి, దశరథ్ , మూర్తి నాయుడు, జంగయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈడబ్ల్యూఎస్‌ అమలు చేయట్లేదు. ఓబీసీ లకు జరిగే అన్యాయంపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వంత నియోజకవర్గ లో ఉన్న బనరస్ విశ్వ విద్యాలయంలో ఈడబ్ల్యూఎస్‌ కి చెందిన ఒక్క ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఒక్కరని కూడా నియమించలేదు. మీరా టీఆర్‌ఎస్‌ పార్టీని విమర్శించేది అని ఆయన మండిపడ్డారు.

దేశంలో 40 కేంద్ర విశ్వ విద్యాలయాలు ఉంటే కేవలం 9 మంది మాత్రమే ఓబీసీకి చెందినవారున్నారు. నీట్‌లో కేంద్ర ప్రభుత్వం ఓబీసీ 27% రిజర్వేషన్ అమలు చేయకపోవడం వల్ల 11027 సీట్లను కోల్పోయారు.(యూజీ, పీజీ, మెడికల్, డెంటల్ ). వీటి పైన ప్రశ్నించకుండా బీజేపీ, ఏబీవీపీ నాయకులు ఉనికి కోసం పాకులాడుతున్నారు. ఓబీసీలకు కేంద్ర మంత్రిత్వ శాఖ ఉంటే దేశ వ్యాప్తంగా ఓబీసీలకు న్యాయం జరుగుతుందని బీసీ సంఘాలతో కలిసి సీఎం కేసీఆర్ ఎన్నో సార్లు నాడు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రధాని నరేంద్రమోదీ లను కలవడం జరిగిందని గుర్తు చేశారు.

బీజేపీ, ఓబీసీలపై కపట ప్రేమకు ఇదే నిదర్శనం. బీజేపీ తన తప్పులను కప్పి పుచ్చడానికి మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడి. రాబోయే దుబ్బాక, మున్సిపల్ ఎన్నికల్లో 1,2శాతం ఓటింగ్ పెంచుకునే ప్రయత్నంలో ఇలాంటి డ్రామాలు చేస్తున్నారు. ఓబీసీ జాతీయ అధ్యక్షుడు కె. లక్ష్మణ్‌ ఓబీసీ లకు ఏమాత్రం న్యాయం చేయగలరో చెప్పగలరా? అని శ్రీనివాస్ ప్రశ్నించారు. వీటిపైన మీరు ఎందుకు స్పందించడం లేదు. తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన రిజర్వేషన్ల బిల్లులపై ఎందుకు చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు.