శనివారం తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ, శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. మధ్యాహ్నం రెండు గంటలకు ఆయన అధ్యక్షతన జరిగే సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆహ్వానించారు. ఇప్పటికే పార్టీ ప్రజాప్రతినిధుల పనితీరుపై సీఎం రెండు దఫాలు సర్వే చేసి, నివేదికలను వారికి స్వయంగా అందజేశారు. తాజాగా మూడో విడత సర్వేను ఈనెలారంభం నుంచి చేయించారు. ఆ నివేదికలు వచ్చాయి. సర్వే ఫలితాలను సీఎం కేసీఆర్ సూచాయగా మూడు రోజుల క్రితం విలేకరుల సమావేశంలో తెలిపారు. నేడు జరిగే ఎల్పీ సమావేశం సందర్భంగా తమ పార్టీ ప్రజాప్రతినిధులకు ఈ ఫలితాలను అందజేసి, సమీక్షించే వీలుంది. గతంలో సర్వే ఫలితాల ఆధారంగా కొందరి పనితీరు సరిగా లేదని, బాగా చేయాలని సీఎం సూచించారు. అలాగే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతివ్వాలనే అంశంపై ఇందులో చర్చించే అవకాశం ఉంది.
పార్టీని సంస్థాగతంగా తీర్చిదిద్దేందుకు వీలుగా నియోజకవర్గ, రాష్ట్రస్థాయి కమిటీలను వేయాలని సీఎం భావిస్తున్నారు. తాజాగా 75 లక్షల మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. పార్టీ శ్రేణులను తీర్చిదిద్దాలని సీఎం యోచిస్తున్నారు. సభ్యత్వ నమోదుపై నియోజకవర్గాల వారి నివేదికలు సీఎంకు అందాయి. కష్టపడి, పార్టీని పటిష్ఠ పరిచిన కీలక నేతలకు నియమిత పదవులతో పాటు పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పదవులివ్వాలనే ప్రతిపాదనను సీఎం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతోపాటు రాష్ట్రావతరణ వేడుకల సందర్భంగా జూన్ 2 నుంచి 4వ తేదీ వరకు నిర్వహించాల్సిన కార్యక్రమాలపై మంత్రులకు, ఎంఎల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం. మూడేళ్లుగా రాష్ట్రంలో చేపడుతున్న పథకాల ఫలితాలను మదింపు చేస్తూనే, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలపై సమీక్ష జరపనున్నారు.