టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులుగా కేటీఆర్ నిన్న తెలంగాణ భవన్ లో బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈకార్యక్రమానికి పెద్ద ఎత్తున టీఆర్ఎస్ కార్యకర్తలు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా తర్వాత కేటీఆర్ గ్రామస్ధాయి నుంచి పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టనున్నారు. అందుకోసం తగిన ప్రణాళికలను సిద్దం చేసుకున్నారు. గ్రామ పంచాయితీ ఎన్నికలు దగ్గర్లోనే ఉండటంతో వాటిపై దృష్టి పెట్టారు కేటీఆర్. అందుకోసం జిల్లాలను పర్యటించనున్నారు.
కేటీఆర్ తొలిసారిగా ఈ నెల 20వ తేదీన వరంగల్ అర్భన్, వరంగల్ రూరల్, జనగామ జిల్లాల్లో పర్యటించనున్నారు.పర్యటనలో భాగంగా కేటీఆర్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్నారు. పార్టీ పటిష్టత, రాబోయే పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేసే విధంగా పార్టీ శ్రేణులకు దిశా నిర్ధేశనం చేయనున్నారు.వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి వరంగల్ జిల్లాకు వస్తున్న కేటీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు సిద్ధమయ్యారు.
ఈ మేరకు హైదరాబాద్ టూరిజం ప్లాజాలో కడియం శ్రీహరి నేతృత్వంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సమావేశమయ్యారు.