మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ భారీ విజ‌యం..

349
trs win
- Advertisement -

మినీ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో టీఆర్ఎస్ పార్టీ క్లీన్‌ స్విప్‌ చేసింది. తాజాగా జ‌రిగిన మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని విజ‌యాన్ని సాధించింది. గ్రేట‌ర్ వ‌రంగ‌ల్, ఖ‌మ్మం మున్సిప‌ల్ కార్పొరేష‌న్ల‌తో పాటు అచ్చంపేట‌, కొత్తూరు, జ‌డ్చ‌ర్ల‌, న‌కిరేక‌ల్, సిద్దిపేట మున్సిపాలిటీల్లో కారు జోరు చూపింది. ఈ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో భారీ విజ‌యాన్ని అందించిన ఓట‌ర్ల‌కు, పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు ఆయా మున్సిపాలిటీల ప‌రిధిలోని టీఆర్ఎస్ నాయ‌కుల‌కు ప్ర‌త్యేక ధన్య‌వాదాలు, కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు.

సీఎం కేసీఆర్ అమ‌లు చేస్తున్న సంక్షేమ‌, అభివృద్ధి ప‌థ‌కాలు పార్టీ విజ‌యంలో కీల‌కంగా ప‌ని చేశాయి. ప్ర‌తి ప‌థ‌కం ల‌బ్దిదారుడు టీఆర్ఎస్ పార్టీకి అండ‌గా నిలిచి ఎన్నిక‌ల్లో పార్టీ అభ్య‌ర్థుల గెలుపున‌కు కృషి చేశారు. సీఎం కేసీఆర్ వ‌ల్లే అభివృద్ధి సాధ్య‌మ‌ని ప్ర‌జ‌లు న‌మ్మి.. మ‌రోసారి ప్ర‌భుత్వంపై విశ్వాసం క‌న‌బ‌రిచారు. ఈ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో గులాబీ జెండాను గుండెల‌కు హ‌త్తుకుని అద్భుత‌మైన తీర్పున ఇచ్చారు ఓట‌ర్లు.

గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌: ఈ కార్పొరేష‌న్ ప‌రిధిలో మొత్తం 66 డివిజ‌న్ల‌కు తాజాగా ఎన్నిక‌లు జ‌ర‌గ్గా.. ఇవాళ ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు వెలువ‌డిన ఫ‌లితాల ప్ర‌కారం టీఆర్ఎస్ పార్టీ 43 డివిజ‌న్ల‌లో గెలిచింది. బీజేపీ 10 డివిజ‌న్ల‌లో, కాంగ్రెస్ – 3, ఇత‌రులు – 5 స్థానాల్లో గెలిచారు. మ‌రో ఐదు డివిజ‌న్ల ఫ‌లితాలు వెల్ల‌డి కావాల్సి ఉంది.

ఖ‌మ్మం కార్పొరేష‌న్‌: ఖ‌మ్మం కార్పొరేష‌న్ ప‌రిధిలో మొత్తం 60 డివిజ‌న్ల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. టీఆర్ఎస్ పార్టీ 43 డివిజ‌న్ల‌లో గెలుపొందింది. కాంగ్రెస్ -09, బీజేపీ -01, ఇత‌రులు -07 డివిజ‌న్ల‌లో గెలుపొందారు.

సిద్దిపేట మున్సిపాలిటీ: సిద్దిపేట మున్సిపాలిటీలో మొత్తం 43 వార్డుల‌కు గానూ, టీఆర్ఎస్ పార్టీ 36 వార్డుల్లో విజ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది. ఒక వార్డులో బీజేపీ గెల‌వ‌గా, మిగ‌తా ఐదు వార్డుల్లో ఇత‌రులు గెలుపొందారు.

అచ్చంపేట మున్సిపాలిటీ: అచ్చంపేట మున్సిపాలిటీ ప‌రిధిలో మొత్తం 20 వార్డులకు గాను 13 స్థానాల్లో టీఆర్ఎస్, 6 స్థానాల్లో కాంగ్రెస్, ఒక స్థానంలో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు.

జ‌డ్చ‌ర్ల మున్సిపాలిటీ: జ‌డ్చ‌ర్ల మున్సిపాలిటీ ప‌రిధిలో మొత్తం 27 వార్డుల‌ ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో టీఆర్‌ఎస్ 23 వార్డుల్లో విజయం సాధించింది. ఇక కాంగ్రెస్‌ పార్టీ రెండు, బీజేపీ 2 స్థానాల్లో విజయం సాధించింది. జడ్చర్ల మున్సిపాలిటీకి ఎన్నికలు జరగడం ఇదే మొదటిసారి.

కొత్తూరు మున్సిపాలిటీ: రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరు మున్సిపాలిటీని టీఆర్ఎస్ పార్టీ కైవ‌సం చేసుకుంది. కొత్తూరు మున్సిపాలిటీలోని మొత్తం 12 వార్డుల‌కుగాను 7 వార్డుల‌ను కైవ‌సం చేసుకుని గులాబీ జెండాను ఎగుర‌వేసింది. ఐదు వార్డుల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థులు గెలుపొందారు.

న‌కిరేక‌ల్ మున్సిపాలిటీ: నకిరేకల్ మున్సిపల్ పీఠంపై గులాబీ జెండా ఎగిరింది. న‌కిరేక‌ల్ మున్సిపాలిటీకి జ‌రిగిన ఎన్నికల ఫలితాలు వెల్ల‌డ‌య్యాయి. మొత్తం 20 వార్డుల‌కు గాను 11 వార్డుల‌ను టీఆర్ఎస్ కైవ‌సం చేసుకుని జ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది.

- Advertisement -