2019లో టీఆర్ఎస్ గెలుపు తథ్యమని ఎంపీ కవిత స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో మీడియాతో చిట్ చాట్‌లో మాట్లాడిన కవిత వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తామని స్పష్టం చేసింది.వచ్చే ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేసేది పార్టీయే నిర్ణయిస్తుందని చెప్పారు. కేసీఆర్ రాజకీయ వారసులు ఎవరనేది భవిష్యత్తే నిర్ణయిస్తుందన్నారు.
తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్ కోదండరాం రాజకీయ పార్టీ పెడితే స్వాగతిస్తామని తెలిపింది కవిత. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారితో తమ పార్టీకి ఎలాంటి ఇబ్బందీ లేదన్నారు. బంగారు తెలంగాణ దిశగా ముందడుగు వేసినట్టు చెప్పారు. సింగరేణి వారసత్వ ఉద్యోగాల ముసాయిదా విధాన రూపకల్పన తర్వాత సీఎం కేసీఆర్ సింగరేణియాత్ర ఉంటుందని కవిత స్పష్టంచేశారు.
రాష్ట్రానికి చెందిన ఒక్కరికైనా పద్మ అవార్డులు రాకపోవడం బాధాకరమన్నారు. కాళేశ్వరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినట్టు చెప్పారు. పార్లమెంట్ వేదికగా తెలంగాణ వాణిని బలంగా వినిపిస్తామన్నారు. పసుపు బోర్డు విషయమై కేంద్రంలో కదలిక తీసుకొచ్చినట్టు చెప్పారు.