తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి రాష్ట్ర కమిటి సభ్యులతో పాటు రాష్ట్ర మంత్రులు, లోక్ సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్ పర్సన్లు, జడ్పీ చైర్ పర్సన్లు, మున్సిపల్ మేయర్లు, డిసిసిబి అధ్యక్షులు, డిసిఎంఎస్ అధ్యక్షులు హాజరైయ్యారు. పార్టీ సభ్యత్వాల పునరుద్ధరణ, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీల నియామకం, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎన్నిక, ఏప్రిల్ 27న పార్టీ వార్షిక మహాసభ, ఇతర సంస్థాగత అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరగనున్నట్లు సమాచారం.
ఎమ్మెల్సీ, కార్పొరేషన్లు, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైనా సీఎం నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. మార్చి చివరినాటికి గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి కమిటీలు ఏర్పాటు చేసి వార్షికోత్సవం నాటికి రాష్ట్రకమిటీ ఏర్పాటు ప్రక్రియ పూర్తిచేయాలని ఇటీవల పార్టీ శ్రేణులకు అధినేత కేసీఆర్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కాగా, కరోనా నేపథ్యంలో గతేడాది పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహించలేదు. పార్టీ ఆవిర్భవించి 20 ఏండ్లు కావొస్తున్న నేపథ్యంలో ద్విదశాబ్ది ఉత్సవాల నిర్వహణకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడంపై నాయకులకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.