మాకు ఓటు అడిగే హక్కు ఉంది- పల్లా రాజేశ్వర్ రెడ్డి

188
Palla Rajeshwar Reddy
- Advertisement -

ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా ఇవ్వాళ పరకాల నియోజకవర్గంలో జరిగిన సమావేశాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్, స్థానిక శాసనసభ్యులు చల్లా ధర్మా రెడ్డి, టీఎస్ఐఐసి చైర్మన్ గ్యాదరి బాలమల్లుతో కలిసి ఎమ్మెల్సీ డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతిపక్షలు ఎన్నికలు రాగానే అబద్ధాలని పదే పదే చెప్తూ దుమ్మెత్తి పొసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి, బూతులు, అవాస్తవాలు మాట్లాడుతూ ప్రచారం ఇష్టమొచ్చినట్లు చేస్తున్నారని పల్లా మండిపడ్డారు.

రాష్ట్రంలో అద్భుతమైన చెరువులని విధ్వంసం చేశారు.. ఈరోజు ప్రతి చెరువు జలకళతో ఉట్టిపడ్తుంది అని అన్నారు. వచ్చే సంవత్సరాంతానికి రాష్ట్రంలోని ప్రతి ఎకరానికి, అది చెరువు ద్వారా కానీ, బావి ద్వారా కానీ, కాలువ ద్వారా కానీ, ప్రాజెక్టు ద్వారా కానీ పూర్తిగా నీళ్ళు అందించేవాడు కేసీఆర్. భారతదేశంలో మొట్టమొదటిసారిగా 50 లక్షల ఎకరాల్లో వరిపంటని ఈ యాసంగిలో ఇక్కడ పండిస్తున్నాం. ఎవరి వల్ల సాధ్యమైంది.. తెలంగాణ తేవడం వల్ల, కేసీఆర్ దార్శనికత వల్ల అని పల్లా అన్నారు. మనం అప్పుల్లో ముందులేము, ఇది కూడా అబద్ధమే. మనకంటే 26 రాష్ట్రాలు అప్పులు ఎక్వ చేసినయి. మేమిచ్చిన సొమ్ముతో దేశంలోని బికారి రాష్ట్రాలు బతుకుతున్నాయి అని అన్నారు. మనం ఆర్థికంగా సౌష్టవంగా ఉన్నం.. నా బిడ్డలకి ప్రసూతి అయితే 12 వేలు, 13 వేలు ఇచ్చి, కేసీఆర్ కిట్ ఇచ్చి, ఇయ్యాల తల్లి, శిశువు మరణ రేటును తగ్గించాం అని అన్నారు.

రాష్ట్రంలో లక్షా 30 వేల ఉద్యోగాలు ఇచ్చినం. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా గురుకులాలను పెంచుకున్నం, 10,500 మంది గురుకుల టీచర్లు కొత్త వాళ్లే అని అన్నారు నేను చెప్పిన అంకెల్లో తప్పుంటే పోటీ నుండి విరమించుకుంటా అని ఛాలెంజ్ చేస్తున్నా.. ఆనాడు చాయ్ అమ్మిన ప్లాట్ఫార్మ్‌ను కూడా అమ్మకానికి పెట్టిండు మోడీ అని అన్నారు. విశాఖ ఉక్కుని అమ్మేస్తున్నారు, నష్టాల్లో ఉంటే మూసేస్తాం అని మోడీ అంటున్నారు అని పల్లా తెలిపారు. మేం ఒక్క సంస్థ మూసేయ్యలే, ఉద్యోగాలు ఇచ్చుకున్నాం, ఉన్న సంస్థల్ని బతికించుకున్నాం అని అన్నారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని రెండు ఇయ్యలే అని విమర్శించారు. 3,24,000 మందికి, చిన్న చిన్న ఉద్యోగస్తులకి కూడా 100%, 200%, 300% జీతాలు పెంచుకున్నాం అని అన్నారు. ఔట్ సోర్సింగ్ అని, కాంట్రాక్ట్ అని, టెంపరరీ అని, పార్ట్ టైం అని, అడ్ హాక్ అని, హవర్లీ బేసిస్ అని రకరకాల పేర్లతో శ్రమ దోపిడీ చేసింది గత ప్రభుత్వం అని రాజేశ్వర్‌ రెడ్డి దుయ్యబట్టారు.

జీతాలు పెంచి, 10 నెలలని 12 నెలలు చేసి, సీఎల్స్ లేకపోతే సీఎల్స్ ఇచ్చి, ఇవన్నీ చేస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం. 2014 తర్వాత హైదరాబాద్ చుట్టుపక్కల దరిదాపుగా 14,800 కొత్త కంపెనీలు ఒచ్చినయి, అందులో 14.5 లక్షల మంది జాయిన్ అయిన్రు అని అన్నారు. 2014 కంటే ముందు ఇన్ని కంపెనీలు రాలేదు కదా, ఇవ్వాళ మేము ఇవ్వడానికి కావాల్సిన అద్బుతమైన పాలసీని తయారు చేసుకున్నాం. 2014 తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఒక్క రేటు కూడా పెంచలే.. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి మంచి నీళ్లిచ్చినం, ఇందుకు మీ నీతి ఆయోగ్, మీ జలవనరుల శాఖ కితాబిచ్చిందని పల్లా గుర్తు చేశారు.

10 వేల కోట్ల విద్యుత్ సబ్సిడీ ఇచ్చినం, ఇవ్వాళ నువ్వు మీటర్లు పెడ్తా అంటున్నవ్.. ఇంతకంటే బెట్టర్ గా ఏ రాష్ట్రమైనా చేసిందా.. మాకు ఓటు అడిగే హక్కు ఉంది అని అన్నారు. ఇంకా కొన్ని చేస్కోవాల్సినవి ఉన్నయ్. నిరుద్యోగ భృతి కానీ, పీఆర్సీ కానీ, రుణమాఫీ లాంటివి కానీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు అని అన్నారు. మేము తిట్టదలుచుకుంటే తిట్ల జడివానలో వీళ్ళందరూ కొట్టుకపోతరు. కానీ మాకు సభ్యత ఉన్నది, సంస్కారం ఉన్నది. కాబట్టి మేము చేసినవి చెప్పుకుంటున్నం.. మీరు కొత్త బిచ్చగాళ్ల లాగా ఈరోజు ప్రశ్నిస్తున్నరు.. టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రశ్నించి, ప్రశ్నించి ఈరోజు పరిష్కారం చూపెడ్తున్నరు అని పల్లా రాజేశ్వర్‌ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -