కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. ఇందులో భాగంగా గజ్వేల్‌లో సీఎం కేసీఆర్ పిలుపు మేరకు.. ఈ ఆందోళన కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు బాగుపడాలంటే బీజేపీ గద్దే దిగాల్సిందేనని అన్నారు. మోదీ ప్రభుత్వం రైతులను దగా చేస్తోందని కేంద్రం తీరుపై మంత్రి నిప్పులు చెరిగారు.
వడ్లు కొనకుండా బీజేపీ రాజకీయ కుట్రలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ గ్రామాన బీజేపీ నేతలను నిలదీయాలి. వడ్లు కొంటరా..కొనరా అని ప్రశ్నించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణకు బీజేపీ చేసిందేంటి ? రైతుల కోసం సీఎం చేయాల్సింది చేశారన్నారు. పంట కొనాల్సిన కేంద్రం చేతులెత్తేస్తోందని బీజేపీపై మండిపడ్డారు.
గ్రామ గ్రామాన బీజేపీ మోసాన్ని,రైతు లకు చేస్తున్న దగాను ఎండ గట్టేందుకే దిష్టిబొమ్మల దగ్థం చేస్తున్నం. మనం చివరి వరకు పోరాడాల్సిందే. రైతుల బతుకు బాగవ్వాలంటే బీజేపీని దించాల్సిందే.ఎరువుల ధర పెంచారు. బాయిల కాడ మీటర్లు పెడతామంటారు,జీఎస్టీ మల్ల. ఇలా చేస్తే రైతులు బాగుపడతరా.. రైతులు బాగుపడాలంటే బీజేపీ గద్దే దిగాల్సిందే. అందుకు పోరాటం చేద్దామని మంత్రి పిలుపునిచ్చారు..