ఎట్టకేలకు టీఆర్‌ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులు ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ పార్టీ లోక్ సభ అభ్యర్థుల లిస్ట్‌ను విడుదల చేశారు. ఈ లిస్ట్ లో పలువురు పాతవారితో పాటు కొత్త అభ్యర్థుల పేర్లున్నాయి. అనుకున్న విధంగానే సీఎం కేసీఆర్ 17 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు టికెట్ నిరాకరించగా, గతంలో ఎంపీలుగా పనిచేసి ఇప్పుడు అసెంబ్లీకి ఎన్నికయిన రెండు స్థానాలతో పాటు మరో 8 చోట్ల కొత్త అభ్యర్థులను బరిలోకి దింపారు.
టీఆర్‌ఎస్ నుండి అనూహ్యంగా టికెట్‌ను దక్కించుకున్న కొత్త అభ్యర్థులు వీరే…
ఖమ్మం, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గాల అభ్యర్థిత్వాలను సీఎం కేసీఆర్ చాలా వ్యూహాత్మకంగా ఖరారు చేశారు. ఖమ్మం నుంచి సిట్టింగ్ ఎంపీ పొంగులేటికి అవకాశం ఇవ్వకపోతే అక్కడి నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. చివరి నిమిషంలో టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుకు అవకాశమిచ్చారు.
పెద్దపల్లి నుంచి గత ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన బాల్క సుమన్ అసెంబ్లీకి ఎన్నిక కావడంతో అక్కడి మాజీ ఎంపీ జి.వివేకానంద టికెట్ ఆశించారు. కానీ, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన ఎక్సైజ్ మాజీ అధికారి వెంకటేశ్ నేతకానికి టికెట్ ఖరారైంది.
చేవెళ్ల నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా గెలుపొంది.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరిన ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి స్థానంలో పౌల్ట్రీ వ్యాపారి రంజిత్‌రెడ్డిని బరిలో దించారు. ఈయన పేరుపై చాలాకాలం క్రితమే ఏకాభిప్రాయానికి వచ్చింది. అయితే.. ఇటీవలి రాజకీయ పరిణామాల్లో మార్పులు చోటుచేసుకోవచ్చనే చర్చ జరిగింది. కానీ, కేసీఆర్ మాత్రం చేవెళ్ల బరిలో రంజిత్‌రెడ్డికే అవకాశమిచ్చారు.
సికింద్రాబాద్ నియోజకవర్గంలో బీసీ సామాజివర్గం ఎక్కువగా ఉండటంతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడైన సాయికిరణ్‌కు సీఎం టికెట్ కేటాయించారు.ఇక మల్కాజిగిరి టికెట్ కోసం పార్టీ నేత నవీన్‌రావు మర్రి రాజశేఖర్‌రెడ్డిల మధ్య పోటీ ఏర్పడింది. రాజశేఖర్‌రెడ్డికే అనుకూలతలుండటంతో సీఎం టికెట్ ఆయనకే ఇచ్చారు.
నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మళ్లీ పోటీ చేసేందుకు ఆసక్తిగా లేకపోవడంతో అక్కడ మునుగోడు మండలం చల్మెడ గ్రామానికి చెందిన వేముగంటి నర్సింహారెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. నాగర్‌కర్నూల్ అభ్యర్థిగా మాజీ మంత్రి పి.రాములుకు కేసీఆర్ అవకాశం కల్పించారు. గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎంపీ మందా జగన్నాథం కూడా టికెట్ ఆశించినప్పటికీ రాములు వైపే కేసీఆర్ మొగ్గు చూపారు.
సిట్టింగ్ ఎంపీకి టికెట్ నిరాకరించిన మహబూబ్‌నగర్ పార్లమెంటు అభ్యర్థిగా మన్నె శ్రీనివాసరెడ్డిని ఖరారు చేశారు. మహబూబాబాద్ సర్వే ఆధారంగా మాలోత్ కవితను ఎంపిక చేశారు. హైదరాబాద్ లోక్‌సభకు స్థానిక టీఆర్‌ఎస్ నేత పుస్తె శ్రీకాంత్‌ను బరిలో దించారు. ఈ అభ్యర్థులకు సీఎం కేసీఆర్ బి-ఫారాలు అందించారు.
టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థుల జాజితా..
సికింద్రాబాద్- తలసాని సాయికిరణ్ యాదవ్
మల్కాజిగిరి-మర్రి రాజశేఖర్ రెడ్డి
చేవెళ్ల- డా. రంజిత్ రెడ్డి
ఆదిలాబాద్- జి నగేశ్
కరీంనగర్ – బోయిన్ పల్లి వినోద్ కుమార్
పెద్దపల్లి- బొర్లకుంట వెంకటేశ్
నిజామాబాద్- కల్వకుంట్ల కవిత
మెదక్- కొత్త ప్రభాకర్ రెడ్డి
జహీరాబాద్- బీబీ పాటిల్
మహబూబ్ నగర్- మన్నె శ్రీనివాస్ రెడ్డి
నాగర్ కర్నూల్- పి రాములు
నల్లగొండ- వేంరెడ్డి నర్సింహారెడ్డి
భువన గిరి- బూరనర్సయ్యగౌడ్
వరంగల్ – పసునూరి దయాకర్
మహబూబాబాద్- మాలోతు కవిత
ఖమ్మం- నామా నాగేశ్వర్ రావు
హైదరాబాద్- పుస్తె శ్రీకాంత్