కేంద్ర ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి అడ్డుతగలకుండా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు టీఆర్ఎస్ ఎంపీలు. ప్రగతిభవన్‌లో పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యుహంపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్. అనంతరం తెలంగాన భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడిన టీఆర్ఎస్ ఎంపీలు రిజర్వేషన్లపై తమది న్యాయ పోరాటమని తెలిపారు.
బీజేపీని కాపాడాల్సిన అవసరం తమకు లేదన్నారు ఎంపీ కేకే. తమ డిమాండ్లు సాధించడం కోసం పార్లమెంట్ లోపల,వెలుపల చేస్తున్న నిరసనలు కొనసాగుతాయని తెలిపారు. రిజర్వేషన్లపై పోరాటం కొనసాగుతుందని..తమ పోరాటాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో తమకు తెలుసన్నారు.
రిజర్వేషన్లపై నాలుగేళ్లుగా కేంద్రం నానుస్తూనే ఉందని ఎంపీ జితేందర్ రెడ్డి తెలిపారు. టీడీపీ,వైసీపీల కంటే ముందుగానే తాము రిజర్వేషన్లపై పోరాటం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో జనాభ ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉందన్నారు. రిజర్వేషన్ల అంశాన్ని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్ చేశారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నాయి ఎంపీ వినోద్ అన్నారు. రెండు రాష్ట్రాలు బాగుండాలన్నదే తమ అభిమతమని కవిత తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చడంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ,వైసీపీ అవిశ్వాస నోటీసు ఇవ్వడం, టీఆర్ఎస్ ఎంపీలు రిజర్వేషన్ల పోరాటం, అలాగే కావేరి జల బోర్డు ఏర్పాటుకు అన్నాడీఎంకే సభ్యులు ఆందోళన చేస్తుండటంతో గత కొన్ని రోజులుగా పార్లమెంట్ ఉభయ సభలు స్తంభించిపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా, విభజన హామీలపై టీడీపీ,వైసీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం చర్చకు రాకపోవడంతో టీఆర్ఎస్ పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఎంపీలు స్పందించారు.