బండి సంజయ్ నడక సంజయ్‌గా మారాడు..

193

ప్రతి పక్ష నేతలు ఆగమాగం అవుతున్నారు..తొందరపడి పక్కరాష్ట్రాలు ముందే కూస్తన్నాయి అన్నట్టుగా ఉంది వారి తీరు. ఇక బండి సంజయ్ నడక సంజయ్‌గా మారారు అని ఎమ్మెల్యే జీవన్‌ రెడ్టి ఎద్దేవ చేశారు. ఈ రోజు ప్రతిపక్షాల తీరుపై ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, పైలా శేఖర్ రెడ్డి, రవీంద్ర కుమార్, ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ ఆర్ ఎస్ ఎల్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు.

జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. పాదయాత్రలు చేసి వైఎస్సార్ తరహాలో ఉన్నత పదవులు పొందేందుకు ప్రతిపక్ష పార్టీలు పోటీపడి పాదయాత్రలు చేస్తున్నారు.సంజయ్ బండిలో పెట్రోల్ అయిపోయింది. అందుకే పాదయాత్ర చేస్తున్నాడు. బండి సంజయ్ నోరు పాడైపోయిందని – కాలినడక చేసి కాళ్ళు పాడు చేసుకునేందుకు పాదయాత్ర చేస్తున్నారు విమర్శించారు. బండి సంజయ్ కాలినడక తెలంగాణలోకాదు ..ఢిల్లీ వైపు నడవాలి. తెలంగాణకు రావాల్సిన నిధుల కోసం ఢిల్లీ వరకు బండి సంజయ్ పాదయాత్ర చెయ్యాలి..ఇక కిషన్ రెడ్డి తెలంగాణకు తెచ్చిన నిధుల గురించి- కేంద్రం రాష్ట్రానికి వచ్చిన నిధుల గురించి పాదయాత్రలో చెప్పాలి అన్నారు. తరుణ్ చుగ్ సొంత రాష్ట్రంలో తను ఎమ్మెల్యేగా గెలిచి మాట్లాడాలి. కాలే ధన్ వాపస్ లావుంగా అన్న మోడీ మాటలు నిజం అయ్యాయా? జీవన్‌ రెడ్డి ప్రశ్నించారు.

తెలంగాణ రాష్ట్రంలో నియంత పాలన నడిస్తే చార్మినార్ దగ్గర సభ ఎలా పెట్టారు? గతంలో ఎవరైనా ఇలా పెట్టారా?.. తెలంగాణలో బండి సంజయ్ నడిచే ప్రతీ చోటా అభివృద్ధి కనిపిస్తుంది..అన్నిట్లో కెసిఆర్ కృషి కనిపిస్తుంది..కెసిఆర్ ది నిజాం పాలన కాదు..నిజాల పాలన…కెసిఆర్ ది అవినీతి పాలన కాదు ..ఆమోద యోగ్యమైన పాలన..సంక్షేమం మోడీ డిక్షనరీ లోనే లేదు.కెసిఆర్ డిక్షనరీ అన్ని పేజీలు అభివృద్ధి సంక్షేమమే అన్నారు…అబద్ధాల్లో మోడీ బడే మియా..కిషన్ రెడ్డి చోటే మియా..మోడి ది సబ్ కా సాత్ కాదు గుజరాత్ కే సాత్..దేశానికి మోడి సాడే సాత్ అని మండిపడ్డారు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. తెలంగాణకు నిధులు తెచ్చి పాదయాత్రలు చేయండి.. ఇగ రేవంత్ రెడ్డి బుడ్డర్ ఖాన్‌కు తక్కువ తుపాకీ రాముడికి ఎక్కువ…చంద్రబాబు చప్రాసికి అసలు రాహుల్ గాంధీ ఎలా తెలుస్తారు?..బండి పాదయాత్రలో ప్రజలు కెసిఆర్ పాలన గొప్పతనాన్ని వివరిస్తారు అని పేర్కొన్నారు.

ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ మాట్లాడుతూ.. బీజేపీ చేసేది ప్రజా సంగ్రామ యాత్ర కాదు- ప్రజా సంకట యాత్ర.టీఆర్‌ఎస్ కార్యకర్తులు సహనం కోల్పోయే విదంగా బండి మాట్లాడుతున్నారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలు తిరుగబడే విదంగా బండి సంజయ్ రెచ్చగొడుతున్నారు అని విమర్శించారు. వాళ్ళ అధిపత్యపోరు వల్ల ఒకరు కంటే ఒకరు రెచ్చగొటే వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలంగాణలో విద్వేషాలు రెచ్చగొట్టే బద్మాష్ సంజయ్ మాట్లాడుతున్నారు. తెలంగాణ సాదించుకుంది కుక్కలు- నక్కలలాంటి వ్యక్తులతో తిట్టిపించుకోవడానికా? అని ప్రశ్నించారు.

బండి సంజయ్ పాదయాత్ర తెలంగాణలో కాదు- మోడీ సొంతరాష్ట్రం గుజరాత్‌లో చెయ్యాలి. తెలంగాణ లాంటి పథకాలు గుజరాత్ లో లేకపోవడంతో రైతులు- వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. బీజేపీకి అధికారం కావాలంటే బీజేపీ తెలంగాణకు చేసిన మంచిని చెప్పుకుంటూ పాదయాత్ర చేయాలి. కేసీఆర్- ఆయన కుటుంబాన్ని పల్లెత్తు మాట అంటే నాలుక తెగ్గోస్తాం.. ఒక చిల్లరగాడు ఎంపీ అయితే ఎంత దరిద్రంగా ఉంటాదో దానికి నిదర్శనం బండి సంజయ్. గుజరాత్ లో వరదలు వస్తే మోడీ 1000 కోట్లు ఇచ్చాడు..హైదరాబాద్ లో వరదలు వస్తే వెయ్యి పైసలు ఇవ్వలేదు. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి హైదరాబాద్‌లో వరదలు వస్తే కేంద్రాన్ని నిధులు ఎందుకు అడగలేదు? అని ప్రశ్నించారు.

ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ మాట్లాడుతూ.. గిరిజనులపై ప్రేమ ఉంటే పార్లమెంట్ లో బండి సంజయ్ ఎందుకు మాట్లాడలేదు? గిరిజనులకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం మోసం చేస్తోంది అని బీజేపీ అసత్యపు ప్రచారం చేస్తోంది. రిజర్వేషన్లు పెంచడం అనేది ఎవరి పరిధిలో ఉంటుంది అనేది బండి సంజయ్ తెలుసుకోవాలి. గత ప్రభుత్వాలు గిరిజనులను- దళితులను పట్టించుకోలేదు. గిరిజనులకు న్యాయం చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన గిరిజన గాంధీ. అటవీ హక్కుల చట్టం గురించి కిషన్ రెడ్డి కేంద్ర కేబినెట్- ప్రధానితో ఎందుకు మాట్లాడటం లేదు? అని ప్రశ్నించారు.