తెలంగాణలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. దీని బారిన సామాన్య ప్రజలే కాదు డాక్టర్లు,పోలీసులు,రాజకీయ నేతలు కూడా పడుతున్నారు. తాజాగా టీఆర్‌ఎస్ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాకు కరోనా పాజిటివ్ అని తెలింది. గత రెండు రోజులుగా సింటమ్స్ కనిపించడంతో ఆయన టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని రిపోర్టు వచ్చింది.
అయితే ఇదివరకే కరోనా బారిన పడిన నిజామాబాద్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డితో గణేష్ గుప్తా కాంటాక్ట్ అయ్యారు. ఈ క్రమంలోనే ఆయనకు కరోనా సోకినట్లు డాక్టర్లు నిర్దారించారు. దీంతో ఒకే జిల్లా నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు కరోనా మహమ్మారి బారిన పడ్డారు. దీంతో అప్రత్తమైన అధికారులు ఆయన్ను కలిసిన వారి వివరాలను సేకరిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో ఇద్దరు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే.
తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 5వేలకు చేరువు అయింది. తెలంగాణలో ఆదివారం ఒక్కరోజే 237 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో 195 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. ఇప్పటి వరకు తెలంగాణలో 2377 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 185 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 2412 మంది యాక్టివ్ కేసులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.