24 అంశాలతో టీఆర్ఎస్ ప్రజా మేనిఫెస్టో

360
trs manifesto
- Advertisement -

24 అంశాలతో ప్రజా మెనిఫెస్టోని రూపొందించింది టీఆర్ఎస్. సికింద్రాబాద్ పరేడ్‌ గ్రౌండ్స్‌లో మేనిఫెస్టోని విడుదల చేసిన కేసీఆర్…ప్రజా సంక్షేమానికే పెద్దపీట వేశారు. కొనసాగిస్తున్న పలు పథకాల పరిధిని పెంచేలా, లబ్ధిదారులకు మరింత మేలు జరిగేలా పలు అంశాలను మేనిఫెస్టోలో పొందుపర్చారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు సాగుతున్న ప్రయత్నాలను ముమ్మరం చేయడంతో పాటు కంటి వెలుగు పథకంతో ఇతర ఆరోగ్య పరీక్షల కోసం వైద్య శిబిరాలు నిర్వహిస్తామని మేనిఫెస్టో పొందుపర్చారు.

మేనిఫెస్టోలోని అంశాలు…

()అన్ని రకాల ఆసరా పెన్షన్లు 1000 రూపాయల నుంచి 2,016 రూపాయలకు పెంచడం, వికలాంగుల పెన్షన్లను 1500 రూపాయల నుంచి 3,016 రూపాయలకు పెంచడం, బీడీ కార్మికుల పీఎఫ్‌ కటాఫ్‌ తేదీనీ 2018 వరకు పొడగించడం.

() వృద్ధాప్య పెన్షన్‌ అర్హత వయస్సును 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గింపు

() రెడ్డి కార్పొరేషన్‌, వైశ్య కార్పొరేషన్‌తో పాటు వెనుకబడిన ఇతర వర్గాల సంక్షేమం కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం

() వివిధ సామాజిక వర్గాల నుంచి కార్పొరేషన్ల ఏర్పాటు కోసం వచ్చిన డిమాండ్లను సానుకూలంగా పరిశీలించడం

() అగ్ర కులాల్లోని పేదల అభ్యున్నతి కోసం ప్రత్యేక పథకాలు ప్రవేశ పెట్టడం

 trs manifesto

() నిరుద్యోగులకు నెలకు 3,016 రూపాయల భృతి అందించడం

() ప్రస్తుత పద్దతిలోనే డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం కొనసాగింపుతో పాటు, సొంత స్థలం ఉన్న అర్హులైన పేదలకు ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల నుంచి 6 లక్షల రూపాయల సాయం అందించడం

() చట్ట సభల్లో బీసీలకు 33 శాతం, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అమలు కోసం పోరాడటం

() ఎస్టీలకు 12 శాతం, మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు కోసం కేంద్రంతో రాజీ లేని పోరాటం

() ఎస్సీ వర్గీకరణ కోసం అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని కేంద్రం ఆమోదించేలా పోరాటం

() వివిధ కులాల కేటగిరీ మార్పు కోసం వచ్చిన విజ్ఞప్తులను సానుభూతితో పరిశీలించడం

() రైతుబంధు పథకం ద్వారా ఏడాదికి ఎకరానికి ఇచ్చే పంట సాయాన్ని 8 వేల నుంచి 10 వేల రూపాయలకు పెంచడం

() రైతులకు లక్షన్నర వరకు పంట రుణాలు మాఫీ చేయడం

() రైతు సమన్వయ సమితి సభ్యులకు గౌరవ భృతి అందించడం

()ఎస్సీ, ఎస్టీ వర్గాల సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలు రూపకల్పనకు నియమించిన కమిటీ ఇచ్చే నివేదికను అమలు చేయడం

() ఐకేపీ ఉద్యోగులను పర్మినెంట్‌ చేయడం. రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను నెలకొల్పడం, వాటి నిర్వహణ బాధ్యతను మహిళ సంఘాలతో కలిపి, ఐకేపీ ఉద్యోగులకు అప్పగించడం, ఈ యూనిట్లు తయారు చేసే ఆహార పదార్థాలను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం

() కంటి వెలుగు పథకం మాదిరిగానే ఇతర ఆరోగ్య పరీక్షల కోసం వైద్య శిబిరాల ఏర్పాటు, ప్రతి వ్యక్తి హెల్త్‌ ప్రొఫైల్‌ రికార్డు చేసి, తెలంగాణ హెల్త్‌ ప్రొఫైల్‌ రూపొందించడం

() ప్రభుత్వ ఉద్యోగులకు సముచితమైన రీతిలో వేతన సవరణ

() ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయస్సు 58 నుంచి 61 సంవత్సరాలకు పెంచడం, నిరుద్యోగులకు ఉద్యోగ నియామక వయో పరిమితి మూడేళ్లు పెంచడం

() పెన్షనర్ల కోసం ప్రత్యేక డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేయడం

() అటవీ ప్రాంతాల్లోని గిరిజన, గిరిజనేతర రైతుల భూ వివాదాలను పరిష్కరించి యాజమాన్య హక్కులు కల్పించడం, పోడు భూముల వివాదాలను త్వరితగతిన పరిష్కరించడం, ఇతర రైతులకు అందుతున్న ప్రయోజనాలకు వారికి వర్తింప చేయడం

() బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ స్థాపనకు చర్యలు

() సింగరేణి భూముల్లో ఇళ్లు కట్టుకున్న వారికి పట్టాలు

() హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు సాగుతున్న ప్రయత్నాలను ముమ్మరం చేయడం

- Advertisement -