తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేపుతున్నాయి. జయలలిత మరణంతో సీఎం కుర్చీ కోసం ఒకే పార్టీకి చెందిన రెండు వర్గాలు పోటీ పడ్డాయి. చివరికి సీఎం శశికళ వర్గం నేత పళని స్వామిని వరించింది. ఆ తరువాత తమిళనాట జయలలిత వారసత్వాన్ని అందిపుచ్చుకునే ఆర్కే నగర్ ఉప ఎన్నిక కూడా ఇరు వర్గాలకు అత్యంత ముఖ్యంగా మారింది. ఈ సీటు ఎవరు గెలిస్తే వారే తరువాతి సీఎం అనేంతగా ప్రచారం నిర్వహించాయి ఇరు వర్గాలు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని దినకరన్ వర్గం ఓటర్లకు భారీగా డబ్బులు ముట్టజెప్పింది. దీంతో పోలింగ్‌కు కేవలం మూడు రోజుల ముందు ఎన్నికల సంఘం ఆర్కేనగర్ ఉపఎన్నికను వాయిదా వేసింది. అంతకు ముందు అధికారులు శశికళ వర్గీయులు, మంత్రుల ఇళ్లలో సోదాలు నిర్వహించి పెద్దఎత్తున నగదుతో పాటు పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ షాక్‌లో నుంచి కోలుకోకముందే ఢిల్లీ పోలీసుల నిర్ణయం శశకళ వర్గాన్ని శరాఘాతంగా తాకింది.
ఆర్కే నగర్ ఉపఎన్నికలో శశికళ వర్గం తరపున పోటీచేస్తున్న ఆమె మేనల్లుడు టీటీవీ దినకరన్‌పై ఢిల్లీపోలీసులు క్రిమినల్ కేసునమోదు చేశారు. ఏఐఏడీఎంకే పార్టీ అధికారిక సింబల్ అయిన రెండాకుల గుర్తు కోసం ఆయన అధికారులకు లంచం ఇచ్చినట్టు పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో పట్టుబడిన నిందితులు దినకరన్ పేరు చెప్పడంతో పోలీసులు ఆయనపై దర్యాప్తు మొదలుపెట్టినట్టు సమాచారం. ఈ కేసులో అరెస్టయిన ఓ నిందితుడి దగ్గరనుంచి పోలీసులు రూ.1.5కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే లంచం కేసులో విచారణ ప్రారంభించిన ఢిల్లీ పోలీసులు త్వరలో ఎన్నికల సంఘానికి నివేదిక అందించనున్నట్టు చెబుతున్నారు.