ఫిలిప్పీన్స్ దేశాన్ని పెను తుఫాను అతలాకుతలం చేసింది. ఈ పెను తుఫాను ధాటికి 182 మంది మృత్యువాతపడ్డారు. మరో 200 మంది వరకు గల్యంతయ్యారు. ఈ పెను తుఫానుకు ‘టెంబిన్’ అనే పేరు పెట్టారు. ఉష్ణ మండల తుఫాను కారణంగా భారీగా వరదలు సంభవించాయి. వరదల ధాటికి మట్టి చరియలు, కొండచరియలు విరిగిపడ్డాయి. అనుంగన్ ప్రాంతానికి సమీపంలో గల శిఖరంపై నుంచి వరద నీరు ఒక్కసారిగా పోటెత్తడంతో భారీ సంఖ్యలో ఇండ్లు, ప్రజలు కొట్టుకుపోయారని సిబుకో పట్టణ మేయర్ బొంగ్ ఎడింగ్ వెల్లడించారు.
పిలిఫ్పీన్స్‌లోని లనావో డెల్ నోర్టే, లనావో డెల్ సుర్, జాంబొయాంగ పెనిన్సులా, రొమినా మరాసిగన్ ప్రాంతాల్లో ఎక్కువ మరణాలు సంభవించినట్లు వెల్లడించారు. వరద ఉధృతికి డజన్ల మందికి పైగా మృతదేహాలు కొట్టుకుపోయాయని తెలిపారు. ఓ వ్యక్తి బోటు సాయంతో బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తుండగా మొసలి చేతిలో ప్రాణాలు విడిచినట్లు వెల్లడించారు.
ఎమర్జెన్సీ రెస్క్యూ టీం, సైనికులు, పోలీసులు, వాలంటీర్లు పెద్ద సంఖ్యలో విపత్తు ప్రాంతాల్లోకి చేరుకుని శిథిలాలు, వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారని ఆయన తెలిపారు. వేలాది మందిని అత్యవసరంగా సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పేర్కొన్నారు. ఇంకా వేలాదిమంది ఎయిర్ అండ్ సీ పోర్టు ప్రాంతాల్లో చిక్కుకున్నట్లు ఎడింగ్ తెలిపారు.
https://youtu.be/bTcFlsaQesM