అందం,అభినయం రెండు కలబోసిన సౌందర్య శిల్పం త్రిష. తన అందాల వర్షంలో ప్రేక్షకులని తడిపి ముద్దచేసిన మనోహరి. మోడలింగ్ రంగం నుంచి వెండితెరపై తళుక్కుమన్న ఈ చెన్నై బ్యూటీ తెలుగు,తమిళ్ ఇండస్ట్రీలో అగ్రహీరోల సరసన నటించి మెప్పించింది. అయితే కొద్దికాలంగా వెండితెరకు దూరమైన త్రిష తాజాగా ఓటీటీలో అలరించనున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఇండియన్ స్ర్కీన్ మీదే ఇప్పటి వరకూ ఏ కథానాయికకూ దక్కని గౌరవం త్రిషకు దక్కింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చాలా తక్కువ మందికి మాత్రమే జారీ చేసే గోల్డెన్ వీసా త్రిష సొంతం చేసుకున్నారు. ఈ వీసాను అందుకున్న తొలినటిగా ఆమె నిలిచారు.
ప్రస్తుతం అబుదాబీ ప్రభుత్వం సినిమా రంగాన్ని అభివృద్ధి చేసే ఆలోచనలో ఉంది. ఇందులో భాగంగా.. స్థానికంగానే కాకుండా అంతర్జాతీయంగా కొత్త టాలెంట్ ను ప్రోత్సహించే ప్రయత్నం ప్రారంభించింది. అలాంటి వారికి గోల్డెన్ వీసాలను జారీ చేయడం ద్వారా తమ దేశంతో దగ్గరి సంబంధాలుండేలా ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగానే త్రిషకి గోల్డెన్ వీసా దక్కింది.