తలాక్..తలాక్..తలాక్‌.. చెల్లదన్న కోర్టు

235
Allahabad-High-Court
- Advertisement -

ముస్లింల సంప్రదాయంలో మూడుసార్లు తలాక్ అంటే మహిళకు విడాకులు ఇచ్చే ముస్లిం పర్సనల్‌ లా త్రిపుల్ తలాక్ విధానంపై గత కొంతకాలంగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. త్రిపుల్ తలాక్‌ను వ్యతిరేకిస్తూ..కొంతమంది ముస్లిం స్త్రీలు కోర్టును ఆశ్రయించారు. దీంతో త్రిపుల్‌ తలాక్ అమలుపై.. ముస్లింల పర్సనల్‌ లా పై కేంద్రంలో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే తాజాగా ట్రిపుల్ తలాక్‌పై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ట్రిపుల్ తలాక్ ముమ్మాటికీ రాజ్యాంగ విరుద్ధమే అని స్పష్టం చేసింది. రాజ్యాంగపరంగా ట్రిపుల్ తలాక్ ఆమోదయోగ్యం కాదని, దీన్ని ఎవరూ ఆచరించాల్సిన అవసరం లేదని తెలిపింది.

Allahabad-High-Court

రాజ్యాంగంలో ఉన్న హక్కులను హరించేలా పర్సనల్ లాబోర్డు ఏదీ ఉండకూడదని హైకోర్టు తెలిపింది. ట్రిపుల్ తలాక్ అనేది మహిళల హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని, దానికి చట్టబద్ధత లేదని చెప్పింది. ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని గౌరవించాల్సిందేనని… రాజ్యాంగానికి ఎవరూ అతీతులు కాదని తెలిపింది.

ట్రిపుల్ తలాక్ విధానం మీద చాలాకాలంగా వాదనలు నడుస్తూనే ఉన్నాయి. మూడు సార్లు తలాక్ అని చెప్పడం ద్వారా భార్యకు విడాకులు ఇవ్వడం అనే ముస్లిం ఆచారం మీద పలు రకాల విమర్శలు, వివాదాలు ఉన్నాయి. కేవలం నోటిమాట ద్వారా విడాకులు ఇచ్చేస్తే మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని పలువురు వాదిస్తున్నారు. అయితే, ఇది తమ మతపరమైన ఆచారాలకు సంబంధించిన విషయమని, ఇందులో వేలు పెట్టడం సరికాదని ముస్లిం మతపెద్దలు వాదిస్తున్నారు. ఎట్టకేలకు ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఒక స్పష్టత వచ్చినట్లయింది. అయితే దీన్ని మళ్లీ సుప్రీంకోర్టులో సవాలు చేసే అవకాశం ఉంది.

- Advertisement -