ట్రాన్స్ జెండర్‌లో మొట్టమొదటి డాక్టర్‌ ఈమె..

362
Trinetra
- Advertisement -

ట్రాన్స్ జెండర్స్‌ పదం ఈ మధ్య ఎక్కువగా వింటున్నాం. సాధారణ వ్యక్తులతో పోలిస్తే ట్రాన్స్ జెండర్లకు సమాజం, కుటుంబం నుంచి అవమానాలు ఎక్కువగానే ఉంటాయి. వారి బాధలు వర్ణణాతీతం. అయితే, అటువంటి అవమానాలకు కృంగిపోకుండా తన మేధాశక్తితో డాక్టర్ అయ్యింది బెంగళూరుకు చెందిన ట్రాన్స్ జెండర్‌ త్రినేత్రా హల్దార్ గమ్మరాజు. ట్రాన్స్ జెండర్‌లో మొట్టమొదటి డాక్టర్‌గా నిలిచిన ఆమె జీవితం ఇప్పుడు ఎంతో మందికి స్పూర్తిదాయకం. 23 ఏళ్ల ట్రాన్స్ ఉమెన్ త్రినేత్రా హల్ధార్ గుమ్మరాజు ఇటీవల ఎంబిబిఎస్ పరీక్షలు పూర్తి చేసి, కర్ణాటక రాష్ట్రంలో మొదటి ట్రాన్స్ ఉమెన్ డాక్టర్ గా గుర్తింపు దక్కించుకుంది.

కర్ణాటకకు చెందిన త్రినేత్ర అసలు పేరు అంగద్ గుమ్మరాజు. స్వస్థలం బెంగళూరు. అయితే తనలో స్త్రీ లక్షణాలు అధికంగా ఉన్నాయని భావించి లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకుంది. అంగద్ అనే తన పాత పేరును తొలగించి, తల్లిపేరు కలిసొచ్చేలా త్రినేత్ర అని మార్చుకుంది. బెంగళూరులో ఎంబీబీఎస్ పూర్తిచేసిన త్రినేత్ర మణిపాల్ కస్తూర్బా మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఇంటర్న్ షిప్ చేస్తోంది. ఇటీవల తాను ఇంటర్న్ షిప్ చేస్తున్న ఆసుపత్రిలో ఓ ప్రసవం చేసి శిశువును చేతుల్లోకి తీసుకున్న క్షణాలు మరపురానివని ఆమె పేర్కొంది.

త్రినేత్ర సోషల్ మీడియాలోనూ ఎంతో చురుగ్గా ఉంటుంది. తన జీవన ప్రస్థానం ఆధారంగా ఓ డాక్యుమెంటరీ కూడా రూపొందించింది. సోషల్ మీడియాలో ఈ ట్రాన్స్ ఉమన్ డాక్టర్‌కు వేల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. తనను ఎంతో అసభ్యకర రీతిలో వేధించేవారని, అవమానకరంగా పిలిచేవారని, అయితే వాటన్నింటినీ అధిగమించి చదువుపై దృష్టి నిలిపి అనుకున్నది సాధించానని త్రినేత్ర మీడియాకు తెలిపింది. ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీలో మొట్టమొదటి డాక్టర్‌గా ఖ్యాతి పొందింది.

- Advertisement -