దేవుడికే శఠగోపం..కిరీటం తాకట్టు!

7
- Advertisement -

భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో దేవుడికి సమర్పించిన కానుకలకే రక్షణ లేకుండా పోయింది. కృష్ణా జిల్లా గుడివాడలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో అత్యంత ఘోరమైన వింత మోసం వెలుగులోకి వచ్చింది. సాక్షాత్తు ఆ శ్రీనివాసుడి అలంకరణ కోసం దాతలు ఇచ్చిన రూ. కోటి విలువైన బంగారు కిరీటాన్ని ఆలయ కమిటీ ప్రెసిడెంట్ సొంత అవసరాల కోసం తాకట్టు పెట్టడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

మాటూరి సుబ్బారావు, లక్ష్మీ కుమారి అనే వృద్ధ దంపతులు తమ 81 ఏళ్ల వయసులో, స్వామివారిపై భక్తితో 2025 జనవరిలో 461 గ్రాముల బరువున్న అద్భుతమైన బంగారు కిరీటాన్ని ఆలయానికి దానంగా సమర్పించారు. అప్పట్లో దీని తయారీకి సుమారు రూ. 70 లక్షల వరకు ఖర్చు అవ్వగా, ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం దీని విలువ కోటి రూపాయలకు పైనే ఉంటుంది.

అయితే, ఇటీవల కాలంలో పండుగలు, విశేష రోజుల్లో కూడా స్వామివారికి ఆ కిరీటాన్ని అలంకరించకపోవడంతో దాతలకు అనుమానం వచ్చింది. ఆలయ కమిటీని కిరీటం ఎక్కడని నిలదీయగా.. మొదట “బ్యాంక్ లాకర్‌లో ఉందంటూ” కాలయాపన చేశారు. దాతలు గట్టిగా నిలదీసేసరికి అసలు గుట్టు విప్పారు. ఆలయ కమిటీ ప్రెసిడెంట్ కోడూరి మోహనరావు, మరికొందరు సభ్యులతో కలిసి ఆ కిరీటాన్ని గుడివాడలోని ఒక మార్వాడీ తాకట్టు దుకాణంలో కేవలం రూ. 38 లక్షలకే తాకట్టు పెట్టినట్లు అంగీకరించారు. దేవుడి సొత్తుతో ఇలా వ్యాపారం చేయడంపై దాతలు, స్థానిక భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read:డయాబెటిస్ ముప్పు..వీటితో చెక్!

బాధిత దాతల ఫిర్యాదుతో ఆలయ ప్రెసిడెంట్ మోహనరావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ప్రస్తుతం ఆ కిరీటాన్ని తీసుకున్న తాకట్టు వ్యాపారి రాజస్థాన్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

- Advertisement -