భారతదేశంలో సైలెంట్ కిల్లర్‌గా మారుతున్న ఆరోగ్య సమస్యల్లో డయాబెటిస్ (మధుమేహం) అత్యంత ప్రధానమైనది. ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ ప్రకారం, ప్రస్తుతం భారతదేశంలో దాదాపు 10.1 కోట్ల మంది డయాబెటిస్‌తో జీవిస్తుండగా, మరో 13.6 కోట్ల మంది ప్రీ-డయాబెటిస్ (డయాబెటిస్ వచ్చే ముందు దశ) స్టేజ్‌లో ఉన్నారు. ఈ ఆందోళనకర పరిస్థితుల్లో వైద్య నిపుణులు ఒక సరికొత్త ఆశాజనకమైన అధ్యయనాన్ని ముందుకు తెచ్చారు.
యూరప్‌లో 4,700 మంది పెద్దలపై సుదీర్ఘంగా 6 సంవత్సరాల పాటు జరిపిన ఒక భారీ పోషకాహార అధ్యయనంలో.. కేవలం మూడు సాధారణ జీవనశైలి మార్పుల ద్వారా డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని ఏకంగా 31 శాతం తగ్గించవచ్చని పరిశోధకులు కనుగొన్నారు. ‘అనల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్’ అనే జర్నల్‌లో ఈ పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి.
ఈ అధ్యయనంలో 55 నుండి 75 సంవత్సరాల మధ్య వయస్సు ఉండి, ఊబకాయం మరియు స్థిరంగా లేని బ్లడ్ షుగర్ లెవెల్స్ వంటి ‘మెటబాలిక్ సిండ్రోమ్’ సమస్యలతో బాధపడుతున్న వారిని ఎంచుకున్నారు. వీరిని రెండు గ్రూపులుగా విభజించారు. మొదటి గ్రూప్..వీరికి ప్రత్యేకమైన డైట్ మరియు వ్యాయామ నియమాలను సూచించారు.రెండో గ్రూప్..వీరు ఎప్పటిలాగే తమ సాధారణ జీవనశైలిని కొనసాగించారు.
ఆరేళ్ల తర్వాత పరిశోధన ఫలితాలను పరిశీలించగా.. మొదటి గ్రూప్‌లోని వారిలో డయాబెటిస్ ముప్పు 31% తగ్గడమే కాకుండా బరువు తగ్గడం, నడుము చుట్టుకొలత తగ్గడం మరియు జీవక్రియలు మెరుగుపడటం వంటి సానుకూల మార్పులు కనిపించాయి.
మెడిటరేనియన్ తరహా ఆహార పద్ధతి..ఈ ఆహార విధానంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, నట్స్, గింజలు మరియు ఆలివ్ ఆయిల్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులకు ప్రాధాన్యత ఇస్తారు. ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్స్‌ను పూర్తిగా దూరం పెట్టి, ఫైబర్ (పీచుపదార్థం) ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగవుతుందని, బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయని పరిశోధకులు తేల్చారు.
రోజువారీ క్యాలరీల వినియోగాన్ని కాస్త తగ్గించడం..మనం తీసుకునే ఆహారంలో క్యాలరీలను నియంత్రించడం. ఈ అధ్యయనంలో పాల్గొన్నవారు నిపుణుల పర్యవేక్షణలో తమ రోజువారీ క్యాలరీల నుండి సుమారు 600 క్యాలరీలను తగ్గించారు. ఇది ఊబకాయం సంబంధిత డయాబెటిస్ ముప్పును తగ్గించడంలో మరియు గ్లూకోజ్ నియంత్రణలో అద్భుతంగా పనిచేసింది.
Also Read:పొగాకు లంగ్స్‌కే కాదు..!
పోషకాహారంతో పాటు క్రమబద్ధమైన శారీరక శ్రమ..కేవలం డైట్ మార్చడమే కాకుండా, దాంతో పాటు రోజూ వాకింగ్ చేయడం లేదా స్ట్రెంత్ ట్రైనింగ్ (వ్యాయామం) వంటి శారీరక శ్రమను అలవాటు చేసుకోవాలని పరిశోధకులు నొక్కి చెప్పారు. మంచి ఆహారం + క్రమం తప్పని వ్యాయామం.. ఈ రెండూ కలిసినప్పుడే శరీరం బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను మరింత సమర్థవంతంగా నియంత్రించగలుగుతుంది.
కఠినమైన డైటింగ్‌లు చేయడం లేదా తాత్కాలికంగా ఫిట్‌నెస్ ఛాలెంజ్‌లు చేయడం కంటే, రోజూ చిన్న చిన్న ఆరోగ్యకరమైన అలవాట్లను క్రమం తప్పకుండా పాటించడమే డయాబెటిస్‌ను జయించడానికి అసలైన మార్గం.

