రోజురోజుకి వైద్య ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రజల్లో కూడా ఆరోగ్యంపై ప్రత్యేక అవగాహన రావడంతో ప్రతి ఒక్క ఫ్యామిలీలో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా భాగమై పోయింది. అయితే కొన్నేళ్ల క్రితం మీరు తీసుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ.. అప్పట్లో మీకు సరిపోతుందనిపించి ఉండవచ్చు. కానీ ప్రస్తుతం రోజురోజుకి పెరిగిపోతున్న ధరల నేపథ్యంలో పాత పాలసీలు పెద్ద జబ్బులు వచ్చినప్పుడు సరిపోవడం లేదు.
ఇలాంటి సమయంలో బేస్ పాలసీని మార్చకుండానే.. ‘టాప్-అప్’ లేదా ‘సూపర్ టాప్-అప్’ ప్లాన్‌ల ద్వారా తక్కువ ప్రీమియంతో మీ బీమా మొత్తాన్ని గణనీయంగా పెంచుకోవచ్చు. ఈ రెండు ప్లాన్‌లను అర్థం చేసుకోవడానికి ‘డిడక్టబుల్’ గురించి తప్పకుండా తెలుసుకోవాలి. డిడక్టబుల్ అంటే క్లెయిమ్ వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ డబ్బులు చెల్లించడానికి ముందే.. మీ జేబు నుండి గానీ, లేదా మీ పాత (బేస్) పాలసీ నుండి గానీ చెల్లించాల్సిన కనీస పరిమితి మొత్తం.
ఉదాహరణకు మీ వద్ద రూ. 5 లక్షల బేస్ పాలసీ ఉంటే.. మీరు రూ. 5 లక్షల డిడక్టబుల్‌తో అదనంగా రూ. 10 లక్షల టాప్-అప్ ప్లాన్ తీసుకోవచ్చు. అప్పుడు రూ. 5 లక్షల వరకు ఖర్చును బేస్ పాలసీ చూసుకుంటుంది. ఆ పైన అయ్యే ఖర్చును టాప్-అప్ పాలసీ భరిస్తుంది.
()టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ ..హాస్పిటల్ బిల్లు ఒకేసారి డిడక్టబుల్ పరిమితిని దాటితేనే ఈ ప్లాన్ వర్తిస్తుంది.ఉదాహరణకు మీ వద్ద రూ. 3 లక్షల డిడక్టబుల్‌తో కూడిన రూ. 10 లక్షల టాప్-అప్ ప్లాన్ ఉందనుకుందాం. మొదటి క్లెయిమ్: హాస్పిటల్ బిల్లు రూ. 4 లక్షలు అయితే డిడక్టబుల్ రూ. 3 లక్షలు పోను మిగిలిన రూ. 1 లక్షను టాప్-అప్ కంపెనీ చెల్లిస్తుంది.
రెండవ క్లెయిమ్…అదే సంవత్సరంలో మళ్లీ హాస్పిటల్ బిల్లు రూ. 2 లక్షలు వస్తే.. ఈ ప్లాన్ రూపాయి కూడా ఇవ్వదు. ఎందుకంటే ఈ విడి క్లెయిమ్ మొత్తం డిడక్టబుల్ పరిమితి (రూ. 3 లక్షలు) కంటే తక్కువగా ఉంది.
()సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ అలా కాదు. ఒక సంవత్సరంలో వచ్చిన అన్ని హాస్పిటల్ బిల్లులను కలిపి ఆ మొత్తం ఎప్పుడైతే డిడక్టబుల్ పరిమితిని దాటుతుందో అప్పటి నుండి సూపర్ టాప్-అప్ కంపెనీ డబ్బులు చెల్లించడం ప్రారంభిస్తుంది.
Also Read:‘ఇట్లు అర్జున’..ఫస్ట్ సింగిల్
టాప్-అప్ ప్లాన్‌లో ప్రతి విడి క్లెయిమ్ డిడక్టబుల్ కంటే ఎక్కువగా ఉండాలి. సూపర్ టాప్-అప్‌లో సంవత్సరంలో వచ్చిన అన్ని బిల్లుల మొత్తం డిడక్టబుల్ దాటితే సరిపోతుంది. టాప్-అప్ ప్లాన్‌తో పోలిస్తే సూపర్ టాప్-అప్ ప్లాన్ ప్రీమియం కొంచెం ఎక్కువగా ఉంటుంది. కానీ వినియోగదారునికి చేకూరే ప్రయోజనాల పరంగా సూపర్ టాప్-అప్ చాలా లాభదాయకమైనది.
మీరు పూర్తి ఆరోగ్యంగా ఉండి భవిష్యత్తులో ఏదైనా పెద్ద ప్రమాదం లేదా గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి పెద్ద పెద్ద వ్యాధుల బారిన పడితే ఒకేసారి వచ్చే భారీ బిల్లుల నుండి రక్షణ పొందాలనుకుంటే ‘టాప్-అప్’ ప్లాన్ సరిపోతుంది. వయసు పైబడిన వారు లేదా ఏడాదిలో ఒకటి కంటే ఎక్కువసార్లు చిన్న చిన్న కారణాలతో ఆసుపత్రిలో చేరే అవకాశం ఉన్నవారు ‘సూపర్ టాప్-అప్’ ప్లాన్‌ను ఎంచుకోవడం ఉత్తమం. ఇది పాలసీదారునికి పూర్తి ఆర్థిక భరోసాను ఇస్తుంది.

