తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డ్రగ్స్‌కేసులో సిట్ మరో నాలుగు ఛార్జిషీట్‌లు దాఖలు చేసింది. ఈ కేసులో సినీ సెలబ్రిటీలు నిందితులు కాదని, బాధితులేనని పేర్కొంది. రెండేళ్ల క్రితం వెలుగుచూసిన ఈఘటనలో పలువురు సినీ ప్రముఖులను విచారించారు పోలీసులు.
ఈ వ్యవహారంలో మొత్తం 12 కేసులు నమోదు చేయగా ఇప్పటివరకు 4 ఛార్జిషీట్ దాఖలు చేసిన పోలీసులు మరో 8 చార్జీ షీట్లు దాఖలు చేయనున్నట్లు సమాచారం. ఆర్టీఐ కింద ఫోరం ఫర్ గుడ్‌గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభ రెడ్డి టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ వివరాలు కోరారు. దీనిపై స్పందించిన ఎక్సైజ్‌శాఖ సంబంధిత సమాచారాన్ని తెలియజేసింది.
కేసు దర్యాప్తు సందర్భంగా మొత్తం 62 మంది నటీ, నటులు, దర్శకులు, సినీ పరిశ్రమలోని ప్రముఖులను విచారించినట్లు వెల్లడించారు. వీరి వద్ద నుంచి గోర్లు, వెంట్రుకల నమూనాలను సేకరించినట్లుగా పేర్కొన్నారు. అయితే టాలీవుడ్ నటుల పేర్లను చార్జిషీట్లలో సిట్ అధికారులు చేర్చలేదు. సిట్ అధికారులు చార్జిషీట్లు దాఖలు చేసిన నాలుగింటిలో ఒకటి సౌత్ ఆఫ్రికా పౌరుడు రఫెల్ అలెక్స్ విక్టర్‌పై ఉంది. ముంబై నుంచి హైదరాబాద్‌కు కొకైన్‌ను తరలించి విక్రయిస్తున్నాడని 2017 ఆగస్టులో అరెస్ట్ చేశారు.