కొన్ని రోజుల క్రితం పుల్వామాలో ఉగ్రవాదుల దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ దాడి నలభై మంది వీర జవాన్లు తమ ప్రాణాలను కోల్పోయారు. ఇప్పుడు మన దేశం వంతు వచ్చింది. భారత వైమానిక దళం దెబ్బకు దెబ్బ కొట్టింది. నియంత్రణ రేఖను దాటి… శత్రు స్థావరాలను ధ్వంసం చేసింది. మొత్తానికి భారత్ బుల్లెట్ దించేసింది. ఈ వార్త భారతీయులందరినీ విజయ గర్వంలో ముంచెత్తింది. ‘జై జవాన్.. జయహో భారత్’ అంటూ భారతావని నినదించింది.
దానికి మన టాలీవుడ్ స్టార్స్ సైతం గళం విప్పారు. జవాన్లు చూపించిన ధైర్యసాహసాలకు జేజేలు పలికారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని ముఖ్య కథానాయకులు, నటీనటులు, సాంకేతిక నిపుణులు తమ ట్విటర్ ఖాతాల్లో విజయనాదం మోగించారు. అందులో మన బాహుబలి ప్రభాస్ ‘భారతీయ వైమానిక దళానికి సెల్యూట్’ అంటూ ట్వీట్ చేయగా… ‘ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ధైర్య సాహసాలు చూస్తుంటే గర్వంగా ఉంది’ అంటూ సూపర్ స్టార్ మహేష్‌బాబు, రామ్ చరణ్ కొనియాడారు.
ఇదే వరుసలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘మన దేశం దీటైన జవాబు ఇచ్చింది’ అంటూ కితాబిచ్చాడు. ‘ఈ దేశం గర్వించే రోజు ఇద’ని అఖిల్ ట్వీట్ చేయగా.. ‘బుల్లెట్ దిగిందా? లేదా’ అంటూ పూరి తనదైన శైలిలో డైలాగ్ వేశాడు. ‘చేతులు ముడుచుకుని కూర్చునే సమయం కాదని ప్రపంచానికి నిరూపించాం’ అంటూ కల్యాణ్‌రామ్ పేర్కొన్నారు. కోన వెంకట్ ‘మేం సమాధానం ఇస్తే సమాధులు కట్టుకోవడానికి శవాలు కూడా దొరకవు’ అంటూ పంచ్ డైలాగ్ వదిలాడు. ఇలా పలువురు సినీ సెలెబ్రెటీలు తమదైన శైలిలో దేశభక్తిని చాటుకున్నారు.