EV:ఈవీ సబ్సిడీ ఇలా పొందండి!

2
- Advertisement -

దేశ రాజధానిలో రోజురోజుకూ పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు, పర్యావరణ అనుకూల రవాణాను ప్రోత్సహించేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా నేతృత్వంలోని ప్రభుత్వం ‘ఢిల్లీ ఎలక్ట్రిక్ వాహనాల విధానం 2026’ ను అధికారికంగా నోటిఫై చేసింది. ఈ సరికొత్త విధానం జూలై 1, 2026 నుండి అమలులోకి వచ్చింది. ఇది మార్చి 31, 2030 వరకు అమలులో ఉంటుంది.

ఈ పాలసీ కోసం రాబోయే నాలుగేళ్లలో ప్రభుత్వం సుమారు రూ. 15,000 కోట్లు ఖర్చు చేయనుందని, అందులో రూ. 7,000 కోట్లు నేరుగా లబ్ధిదారులకు రాయితీల (సబ్సిడీల) రూపంలో అందుతాయని సీఎం తెలిపారు. ఢిల్లీ వాహన కాలుష్యంలో అత్యధికంగా 23 శాతం వాటా రవాణా రంగం నుంచే వస్తోందని, దీనిని అదుపు చేయడమే ఈ పాలసీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

సబ్సిడీ వివరాలు:

ఎలక్ట్రిక్ టూ-వీలర్ (ద్విచక్ర వాహనం) కొనుగోలుపై మొదటి ఏడాది రూ. 30,000 సబ్సిడీ లభిస్తుంది (రెండో ఏడాది రూ. 20,000, మూడో ఏడాది రూ. 10,000 కి తగ్గుతుంది).

ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ల (ఆటోలు) పై రూ. 50,000 వరకు సబ్సిడీ అందుతుంది.

కామర్షియల్ లైట్ వెహికల్స్ (N1 కేటగిరీ – చిన్న గూడ్స్ వాహనాలు) కొనుగోలుకు రూ. 1 లక్ష వరకు ఆర్థిక సహాయం లభిస్తుంది.

ఎక్స్‌-షోరూమ్ ధర రూ. 30 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉన్న అన్ని ఎలక్ట్రిక్ కార్లకు రోడ్డు పన్ను (Road Tax), రిజిస్ట్రేషన్ ఫీజుల నుండి పూర్తి మినహాయింపు లభిస్తుంది.

స్క్రాపింగ్ ఇన్సెంటివ్ (పాత వాహనాల తుక్కు విధానం): పాత BS-IV లేదా అంతకంటే పాత ఇంధన వాహనాలను స్క్రాప్ (తుక్కు) చేసి, కొత్త ఈవీలను కొనుగోలు చేసే వారికి అదనంగా స్క్రాపింగ్ ఇన్సెంటివ్‌లను కూడా అందిస్తారు. కార్ల స్క్రాపింగ్‌పై గరిష్టంగా రూ. 1 లక్ష వరకు ప్రయోజనం ఉంటుంది.

సబ్సిడీల కోసం ఆన్‌లైన్ పోర్టల్: పారదర్శకత కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ‘ఈవీ సబ్సిడీ పోర్టల్’ను ప్రారంభించింది. వాహనదారులు తమ ఆధార్, ఆర్‌సీ, ఓటర్ ఐడీ పత్రాలను అప్‌లోడ్ చేసి ఆన్‌లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవచ్చు. సబ్సిడీ సొమ్ము నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి (DBT ద్వారా) 60 రోజుల్లోగా జమ అవుతుంది.

ఈ నూతన విధానం కేవలం పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ వాహనాలకు (Pure EVs) మాత్రమే వర్తిస్తుందని, హైబ్రిడ్ వాహనాలకు ఎటువంటి సబ్సిడీలు ఉండవని ప్రభుత్వం స్పష్టం చేసింది.ప్రస్తుతం రోడ్లపై తిరుగుతున్న పాత పెట్రోల్ వాహనాలపై ఎటువంటి తక్షణ నిషేధం లేదని సీఎం స్పష్టం చేశారు. వాటి కాలపరిమితి (Validity) ఉన్నంతవరకు యథావిధిగా నడుపుకోవచ్చని తెలిపారు. అయితే కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లపై గడువులను ఈ క్రింది విధంగా విధించారు:

జనవరి 1, 2027 నుండి ఢిల్లీలో కొత్త పెట్రోల్/సీఎన్‌జీ త్రీ-వీలర్ల (ఆటోల) రిజిస్ట్రేషన్లను పూర్తిగా నిలిపివేస్తారు. కేవలం ఎలక్ట్రిక్ ఆటోలను మాత్రమే అనుమతిస్తారు.

Also Read:E20 పెట్రోల్..మైలేజ్ తగ్గుతుందా?

ఏప్రిల్ 1, 2028 నుండి కొత్త పెట్రోల్ ద్విచక్ర వాహనాల (టూ-వీలర్స్) రిజిస్ట్రేషన్లను నిలిపివేసి, కేవలం ఎలక్ట్రిక్ టూ-వీలర్లను మాత్రమే రిజిస్టర్ చేస్తారు. ఈ విప్లవాత్మకమైన విధానం ద్వారా 2030 నాటికి ఢిల్లీని కాలుష్య రహిత నగరంగా మార్చడమే కాకుండా, భవిష్యత్తులో వచ్చే ఈవీ వ్యర్థాల నిర్వహణ కోసం ఇప్పుడే ఒక ప్రత్యేక ‘ఈ-వేస్ట్ ప్లాంట్’ ఏర్పాటుకు కూడా సన్నాహాలు చేస్తున్నట్లు సీఎం రేఖా గుప్తా వెల్లడించారు.

- Advertisement -