దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. నిన్న ఒక్కరోజే దాదాపుగా 16వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా కరోనాతో మరో ఎమ్మెల్యే మృత్యువాత పడ్డారు.
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే తమోనాష్ ఘోష్ ఇవాళ కన్నుమూశారు. గత నెలలో ఆయనకు కరోనా పాజిటివ్ రాగా ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్ధితి విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు.
తమోనాష్ మృతిపట్ల సీఎం మమతా బెనర్జీ విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు సంతాపం తెలిపిన మమతా…ఇది చాలా విషాదకరమని పేర్కొన్నారు. ఫాల్తా నియోజకవర్గం నుంచి తమోనాష్ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని 1998 నుంచి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్‌గా పనిచేస్తున్నారని మమతా తెలిపారు. చివరి వరకు ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేశారని మమతా కొనియాడారు.
ఇక ఇటీవలె కరోనాతో తమిళనాడుకు చెందిన డీఎంకే ఎమ్మెల్యే అన్బగన్ మృతిచెందిన సంగతి తెలిసిందే.