టిక్ టాక్ సోషల్ మీడియాలో ఈ పేరు తెలియనివారుండరు. ఇప్పుడు టిక్-టాక్ వీడియోల జోరు బాగా నడస్తోంది. మొబైల్ యూజర్లను ఈ టిక్‌టాక్ యాప్ బ్లూవేల్ గేమ్ తరహా పీడిస్తోంది. ఈ యాప్‌లో లైక్స్, కామెంట్స్ కోసం యూజర్లు ఎంతటికైనా తెగిస్తున్నారు. గంటల తరబడి సమయాన్ని వృథా చేసుకుంటున్నారు.
యువత రకరకాల జిమ్మిక్కులు చేస్తూ ఆ వీడియోలను టిక్-టాక్ వీడియోలంటూ అప్‌లోడ్ చేయడం ఫ్యాషన్‌గా మారింది. ఏ మాత్రం హద్దు అదుపులేకుండా వీడియోలను అప్‌లోడ్ చేస్తున్నారు. దీంతో ఈ యాప్‌ను నిషేధించాలనే డిమాండ్ కూడా వ్యక్తం అవుతోంది. అయితే అప్పుడప్పుడూ ఈ టిక్-టాక్ మోజు వికటించి దుష్పరిణామాలకు దారితీస్తున్నది.
వీడియో కోసం చేసే కసరత్తులో ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన తమిళనాడులోని తంజావూరులో జరిగింది. సూర్య, రీగన్, విఘ్నేశ్ అనే ముగ్గురు విద్యార్థులు బైక్‌పై విన్యాసాలు చేస్తు టిక్-టాక్ వీడియో తీస్తున్నారు. వారి దృష్టి వీడియో మీద ఉండడంతో ఎదురుగా ఏమి వస్తున్నదో చూసుకోలేకపోయారు. నేరుగా వెళ్లి ఓ బస్సును ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆస్పత్రిలో చేర్పించగా ముగ్గురిలో ఓ వ్యక్తి పరిస్థితి విషమించి మరణించాడు. ప్రస్తుతం నెట్లో ఈ వీడియో వైరల్ గా మారింది