హైదరాబాద్ కూకట్‌పల్లిలో విషాద సంఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న వివేకానందనగర్‌లో రోడ్డు ప్రమాదం సంభవించింది. మొక్కు తీర్చుకోవడానికి ద్విచక్రవాహనంపై ఆలయానికి వెళ్తున్న కుటుంబాన్ని వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. ఆదివారం ఉదయం బల్కంపేట ఆలయంలో మొక్కు తీర్చుకోవడానికి స్కూటీపై నర్సింహులు, లలిత, చిన్న కుమార్తె శిరీష బయలుదేరారు. కూకట్‌పల్లి వివేకానందనగర్ చౌరస్తాకు రాగానే సిమెంట్ లోడుతో వెళ్తున్న ఏపీ09డబ్ల్యూ 7478 నంబరు గల లారీ వీరిని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో వారు కింద పడగానే వారిపై నుంచి లారీ దూసుకెళ్లింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు.
రామచంద్రాపురంలోని ఇసుకబావి సమీపంలో ఉండే నర్సింహులు, లలిత భార్యాభర్తలు. కూలీ పనిచేసుకొని జీవనం సాగించే వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ ఘటనలో మల్లంపేటకు చెందిన మచ్చగిరి అనే జీహెచ్‌ఎంసీ కార్మికుడికి కూడా గాయాలయ్యాయి. సంఘటనాస్థలంలోని దృశ్యాలు హృదయ విదారకరంగా ఉన్నాయి. లారీ డ్రైవర్ పరారీలు ఉన్నట్టు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు.