ప్రవాసాంధ్రుడు చిగురుపాటి జయరాం హత్య కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు మరో ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేశారు. ఈ మేరకు దర్యాప్తు అధికారి కేఎస్ రావుతో కలిసి వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. ఎస్‌ఆర్‌నగర్‌లోని బాపూనగర్‌కు చెందిన రౌడీషీటర్ నేనావత్ నగేష్ అలియాస్ సింగ్ అలియాస్ బాబుసింగ్(35), ఆయన మేనల్లుడు విస్లావత్ విశాల్(20), సుభాష్‌చంద్రారెడ్డి(26)లను అదుపులోకి తీసుకున్నట్టు వివరించారు.
హత్యోదంతంలో వీరు ప్రత్యక్షంగా పాల్గొన్నట్టు డీసీపీ తెలిపారు. వీరందరూ కలిసి ప్రధాన నిందితుడు రాకేశ్ రెడ్డి ఇంట్లో జయరాంతో బలవంతంగా పత్రాలపై సంతకాలు తీసుకున్నారు. ఈ ఘటనను నగేశ్ వీడియో తీసినట్టు పోలీసులు తెలిపారు. జయరాం చేతులను విశాల్ గట్టిగా పట్టుకోగా.. రాకేష్‌రెడ్డి గొంతు నులమడంతోపాటు దిండు ముఖంపై ఉంచి ఊపిరాడకుండా చేయడంతో ఆయన చనిపోయాడు’’ అని డీసీపీ వెల్లడించారు. భవిష్యత్తులో మరికొంత మందిని అరెస్ట్ చేయనున్నామని, జయరాం మేనకోడలు శిఖాచౌదరిపై కేసు నమోదు చేశామని, ఆమెను మరోసారి విచారిస్తామని తెలిపారు.