ఎలాంటి అబద్ధాన్నైనా ఇట్టే పసిగట్టగలమనే నమ్మకంతో 20 మంది కంటెస్టెంట్స్ లలితా మహల్లోకి అడుగుపెట్టారు. వారాల పాటు సాగిన మర్డర్స్, బ్లాక్మెయిల్, తప్పుడు అంచనాలు, ఉత్కంఠభరితమైన ‘రింగ్ ఆఫ్ డౌట్’ రౌండ్ల తర్వాత ప్రైమ్ వీడియో ‘ది ట్రైటర్స్ తెలుగు’ తొలి సీజన్ అనూహ్యమైన ముగింపునకు చేరుకుంది. ఇన్నోసెంట్స్గా ప్యాలెస్‌లోకి అడుగుపెట్టిన ఇద్దరు ప్లేయర్స్.. చివరికి గేమ్‌లోనే అతిపెద్ద మోసాన్ని విజయవంతంగా అమలు చేశారు. చివరి దశలో తమ తోటి కంటెస్టెంట్స్‌ను మించిపోయిన శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి ‘ది ట్రైటర్స్ తెలుగు’ విజేతలుగా నిలిచి రూ.42,77,000 ప్రైజ్ మనీని సొంతం చేసుకున్నారు.
స్వీకర్ ప్రయాణం ఇన్నోసెంట్‌గా మొదలైంది. అయితే రహత్, ఆశికా అతడిని ట్రైటర్గా నియమించడంతో గేమ్‌లో అతడి పాత్ర మారిపోయింది. ధనుంజయ ఎప్పటికప్పుడు స్వీకర్‌ను అనుమానిస్తూ వచ్చినా.. అతడు మాత్రం అందరి మధ్యే ఉంటూ తన అసలు పాత్రను దాచిపెట్టాడు. శ్రావ్య ప్రయాణం కూడా అంతే అనూహ్యంగా సాగింది. బ్లాక్మెయిల్ ద్వారా ఆమె ట్రైటర్స్ టీమ్‌లోకి చేరింది. అయితే ఆ పాత్రలో కొనసాగడం ఆమెకు అంత సులభం కాలేదు. గేమ్‌లో ఎక్కువ భాగం ట్రైటర్స్‌ను గుర్తించి, వారి అసలు రంగును బయటపెట్టేందుకు ప్రయత్నించిన శ్రావ్య.. ఒక్కసారిగా వారి వైపు చేరడంతో పూర్తిగా భిన్నమైన పాత్రను పోషించాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఆమెపై మానసిక ఒత్తిడి కూడా స్పష్టంగా కనిపించింది. తన వీడియో డైరీలో మాట్లాడుతూ.. “ట్రైటర్గా ఆడటం చాలా కష్టం” అని అంగీకరించింది. వర్షాను ఎలాగైనా గేమ్ నుంచి బయటకు పంపించాలని స్వీకర్‌కు చెప్పిన తర్వాత.. “నేనేదో విచిత్రమైన నేరస్థురాలిలా అనిపిస్తోంది” అని కూడా ఆమె చెప్పింది.
ఫినాలేలో ట్రైటర్స్ చివరిగా ప్రణవ్ను హత్య చేశారని తేజ సజ్జా వెల్లడించడంతో గేమ్ కీలక మలుపు తిరిగింది. ఆ తర్వాత ధనుంజయ ట్రైటర్స్‌ను బయటపెట్టేందుకు చివరిసారిగా ప్రయత్నించాడు. తన ప్రైవేట్ రిఫ్లెక్షన్లో శ్రావ్య, స్వీకర్ ఇద్దరినీ అనుమానితులుగా పేర్కొన్నాడు. అంతేకాదు, స్వీకర్‌ను గేమ్ నుంచి బయటకు పంపించి, ప్రైజ్ మనీని అతడితో పంచుకోకుండా ఒంటరిగా గెలవాలని శ్రావ్యకు సూచించాడు. అయితే అతడి అనుమానాలకు మిగతా కంటెస్టెంట్స్ నుంచి మద్దతు లభించలేదు. ఫైనల్ ‘రింగ్ ఆఫ్ డౌట్’ తొలి రౌండ్లో అందరూ ఏకగ్రీవంగా ధనుంజయను గేమ్ నుంచి బయటకు పంపించారు. అయితే ఆ సమయంలో అతడు శ్రావ్య పేరును మాత్రం ప్రస్తావించలేదు. చివరికి శ్రావ్య, స్వీకర్, వర్షా, మేఘనాథ్ మాత్రమే మిగిలారు. తొలుత వర్షా ఎలిమినేట్ అయ్యింది. ఆ తర్వాత ‘ట్రస్ట్’, ‘డౌట్’ మధ్య చివరి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. మేఘనాథ్ ‘డౌట్’ను ఎంచుకోగా.. శ్రావ్య, స్వీకర్ మాత్రం తమ మధ్య ఉన్న నమ్మకంతో ‘ట్రస్ట్’ను ఎంచుకున్నారు. ఇద్దరు ట్రైటర్స్ ఇన్నోసెంట్స్ను మించి చివరి వరకు నిలిచారు. ఈ విషయం బయటపడటంతో మేఘనాథ్ షాక్‌కు గురయ్యాడు. తనకు అత్యంత సన్నిహితురాలైన శ్రావ్య గేమ్‌ప్లే గురించి స్పందిస్తూ.. “ఆమెను నటీనటులు కూడా ఓడించలేరని అనుకున్నాను. నిజమైన ట్రైటర్స్‌ను కూడా ఆమె మోసం చేయగలదు. నేను చాలా షాక్ అయ్యాను” అని వ్యాఖ్యానించాడు.
Also Read:పండగ వేళ షాపింగ్..సైబర్ మోసాల పట్ల జాగ్రత్త!

