తెలంగాణకు స్వర్ణయుగం..

198
ktr
- Advertisement -

తెలంగాణకు స్వర్ణయుగం రాబోతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. స్వల్ప వ్యవధిలోనే ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నదని…దేశం మొత్తం తెలంగాణ వైపు ఆసక్తిగా చూస్తోందని తెలిపారు. శాంతి భద్రతలు, వ్యవసాయం, నీటిపారుదల, విద్యుత్తు, తాగునీరు, విద్య, వైద్య రంగాల్లో భారీ ప్రణాళికలతో అనేక మైలురాళ్లు దాటుతూ ముందుకు వెళుతున్నామని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మీడియాతో మాట్లాడిన కేటీఆర్….సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలతో దేశం అబ్బురపడుతుందన్నారు.

పెట్టుబడులకు తెలంగాణ అనువైన ప్రదేశమని….అందుకే టాప్ కంపెనీలు హైదరాబాద్ వైపు చూస్తున్నాయని తెలిపారు. టీఎస్‌ ఐపాస్‌తో పారిశ్రామిక రంగంలో పురోగతి సాధిస్తున్నామని….స్థానిక యువతకు ఉద్యోగం, ఉపాధి కల్పించే స్థాయికి ఎదగడం అనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఆపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఊబర్‌లు లాంటి కంపెనీలు నగరంలో కొలువుదీరాయని తెలిపారు.

నోట్ల రద్దుతో ఆదాయం పడిపోయిందన్న కేటీఆర్…బాధ్యత కలిగిన ప్రభుత్వంగా ప్రజలకు ఇబ్బందులు తొలగించడంపై దృష్టి సారించామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక స్థితిని కాపాడుకోవటం మా ముందున్న ప్రధమ కర్తవ్యమని తెలిపారు. టీఎస్ వాలెట్‌ను ప్రారంభించామన్న కేటీఆర్…. డిజిటల్ తెలంగాణ ప్రాజెక్టును మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్తామని తెలిపారు.

ప్రతిపక్షాలను ప్రజలు విశ్వసించే స్ధితిలో లేరని…దానికి నిదర్శనమే మెదక్ ఉప ఎన్నిక నుంచి వరంగల్ ఉప ఎన్నిక, జీహెచ్‌ఎంసీ, నారాయణఖేడ్, పాలేరు, కార్పొరేషన్, కంటోన్మెంట్ ఎన్నికలని తెలిపారు. జిల్లాల ఏర్పాటుతో పాలన ప్రజలకు మరింత చేరువయ్యిందని స్పష్టం చేశారు. ఏక కాలంలో 21 జిల్లాల ఏర్పాటుపై హర్యానా సీఎస్ ఆశ్చర్యం వ్యక్తం చేశారని తెలిపారు.

చేనేత తదితర రంగాల్లో కొత్త పాలసీలను త్వరలోనే క్యాబినెట్ ఆమోదించబోతున్నదన్నారు. తెలంగాణ కంటే ముందు ఏర్పడిన జార్ఖండ్, ఉత్తరాఖండ్, చత్తీస్‌గఢ్‌లు ఇప్పటికీ సమస్యల మధ్య ఉనికిని నిలుపుకోవటానికి తంటాలు పడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై స్వల్పకాలమే గడిచింది. అయినా రాష్ట్రంలో స్థిరత్వం- బ్రహ్మాండమైన అభివృద్ధితో ముందుకు సాగుతున్నామని తెలిపారు.

గతంతో పోలిస్తే సర్కారు దవాఖానల్లో పరిస్థితి మారింది. ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌లలో ఇపుడు లివర్, కిడ్నీ, గుండె ఆపరేషన్లు సైతం జరుగుతున్నాయి. గ్రామీణ దవాఖానల్ల్లో సేవలు మెరుగుపర్చడం, 108 వాహనాల పెంపు, మండలాల్లో 30 పడకలు, నియోజకవర్గాల్లో 100 పడకల దవాఖానలను ప్రారంభించామని తెలిపారు.

శాంతి, భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని కేటీఆర్ తేల్చి చెప్పారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి మరింత సహకారం అందాలన్నారు. హైకోర్టు విషయంలో పురోగతి లేదు. ఐటీఐఆర్ విషయంలోకూడా పురోగతి లేదు. పోలవరం విషయంలో బాధపెట్టే నిర్ణయం తీసుకున్నారని కేటీఆర్ అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడానికి నిరంతరం శ్రమిస్తున్నామని…ప్రజలు మేము బాగా పని చేశామని భావిస్తే.. మరోసారి అవకాశం ఇస్తారు. లేదా ఇంట్లో కూర్చుంటాం. వీ ఆర్ రెడీ..అన్నారు కేటీఆర్.

- Advertisement -