పెద్ద నోట్లను రద్దు చేస్తూ.. కేంద్రం చేసిన ప్రకటనకు ఎనిమిది రోజులు పూర్తయిపోయాయి. సంచలన నిర్ఱయాలు తీసుకున్నప్పుడు.. సహజంగానే జనంలో ఆందోళన, గందరగోళం అంతా సాధారణమే అనుకున్నారు. రెండు రోజులు ఓపిక పడితే పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందని అనుకున్నారు. కానీ ఇప్పటికీ.. బ్యాంకుల మందు, ఏటీఎంల ముందు అదే క్యూ కనిపిస్తోంది. ఆఖరికి గంటల తరబడి క్యూ లో నిలుచున్న వ్యక్తులు ఓపిక నశించి బ్యాంకు అద్దాలు ధ్వంసం చేస్తున్న ఘటనలు కూడా ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల చోట చేసుకుంటున్నాయి. సికింద్రాబాద్ మారేడ్ పల్లి ఆంధ్రా బ్యాంకు ముందు రిటైర్డ్ ఉద్యోగి లక్ష్మీనారాయణ క్యూలోనే కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తీసుకెళ్లే సరికే చనిపోయాడు. దేశంలో ఇలాంటి ఘటనలు ఎన్నో చోటు చేసుకుంటున్నాయి.
ఓవైపు రూ.2వేల నోటుకు సరిపోయే సాఫ్ట్‌వేర్ ను తయారుచేసి.. దాన్ని ఏటీఎంలలో ప్రవేశపెట్టడానికి మరికొన్ని రోజులు పడుతాయని ఆయా బ్యాంకు సంస్థలు ప్రకటిస్తున్నాయి. ఇక రూ.2వేల నోటు దొరికినా.. దానికి కావాల్సిన చిల్లర దొరక్క జనం నానా తిప్పలు పడుతున్నారు. హైదరాబాద్ లో చిల్లర కోసం ఉదయం నుంచి జనం బ్యాంకుల ముందు బారులు తీరారు. తమ దగ్గర ఉన్న పాత నోట్లు చెల్లక.. నిత్యావసరాలు కొనుక్కునేందుకు కూడా చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు సామాన్యులు.
ఉద్యోగులైతే తమ ఉద్యోగాలకు సెలవు పెట్టి బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ తిరుగుతున్నారు. పనులన్నీ మానుకొని కేవలం చిల్లర కోసమే రోజంతా నరకయాతన పడుతున్నారు. పొద్దంతా బ్యాంకుల దగ్గర పడిగాపులు కాసినా.. చేతికి వంద నోట్లు రాలేదు. ఏ ఏటీఎం వద్దయినా.. నోట్లు ఉండి.. లైను ఉందంటే.. ఆ మార్గంలో వెళ్తున్న వారు ఆగి మరీ డబ్బులు తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గంటల తరబడి లైనులో నిల్చుని తీరా తమ వంతు వచ్చే సరికి ఏటీఎంలో నగదు అయిపోవడంతో చాలా మంది నిరాశగా వెనుదిరుగుతున్నారు. తమ దురదృష్టానికి ఎవరిని నిందించాలో తెలియని అయోమయ పరిస్థితి వారిది. గంటల తరబడి లైన్లో నుంచొని డిపాజిట్ చేసిన తర్వాత విత్ డ్రా కోసం మరో పోరాటం చేయాల్సి వస్తుంది. ఇక ఏటీఎంల దగ్గరయితే చాంతాడంత క్యూలు వెలిశాయి. చిల్లర లేక పచారీ దుకాణాలు, షాపింగ్ మాళ్లలో బిజినెస్ డల్లయింది. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ పొద్దున్న లేచిందంటే మొదటి పని ఏటీఎంలను దర్శనం చేసుకుంటున్నారు.