అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు ఎంపీ సంతోష్ కుమార్. తన జీవితంలో మహిళల ఇంపార్టెన్స్‌ని వివరిస్తూ వారి గొప్పతననాన్ని తెలిపారు. తాను నమ్మే, గౌరవమిచ్చే గొప్పవ్యక్తులు అమ్మ, పెద్దమ్మ అని…ఒకరు జన్మనిస్తే మరొకరు తన జీవితానికి అర్దం నేర్పిన వారని కొనియాడారు.అబ్బాయిలు,అమ్మాయిలు సమానమనే కుటుంబంలో పెరిగానని తెలిపారు. వాస్తవానికి మా కుటుంబంలో మహిళలు ఎల్లప్పుడూ పైచేయి సాధించేవారని తాము వారి సామర్ధ్యం మరియు విజయాలను విస్మయంతో చూస్తూనే ఉన్నామని తెలిపారు.
తాను కరీంనగర్ లోని కొడురుపాక గ్రామంలో పెరిగినప్పటికీ, ఆడపిల్లలే కదా అనే వ్యత్యాసాలను తాను మా కుటుంబంలో చూడలేదన్నారు. నా జీవితంలో అమ్మ శశికళ, పెదమ్మ శోభా అమ్మ, నా సోదరీమణులు కవిత,సౌమ్య మరియు నా భార్య, జీవిత భాగస్వామి రోహిణి అంతా తనకు ఏదో సమయంలో ఆదర్శంగా నిలిచిన వారేనని తెలిపారు. మా అమ్మ దేవకిలా, పెద్దమ్మ యశోదలా ఒకరు నన్ను ఈ ప్రపంచంలోకి తీసుకువస్తే, మరొకరు నా ఎదుగుదలను ప్రోత్సహించారని తెలిపారు.
తన జీవితంలో ఈ ఇద్దరు నమ్మశక్యం కాని మహిళలు అని కుటుంబాలను నడిపించడంలో, సంబంధాలను చెక్కుచెదరకుండా ఉంచడంలో వారికి వారే సాటి అన్నారు. ఎప్పుడూ నిజాయితీతో ఉండాలని అమ్మ తనకు గుర్తు చేస్తుంటుందని.. ఇతరుల అభిప్రాయాలను గౌరవించాలని, ఎవరినీ బాధపెట్టవద్దని సూచిస్తుంటుందని చెప్పారు సంతోష్.
చాలా మందికి, మా పెద్దమ్మ సీఎం కేసీఆర్ గారి భార్య. కానీ ఆమె గురించి తెలిసిన వారికి మాత్రం అన్నపూర్ణ. 1980 నుండి కేసీఆర్ గారు సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుండి ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి వండి పెట్టేదని గుర్తుచేశారు. 4 దశాబ్దాలకు పైగా పెద్దనాన్నకి నీడగా ఉన్నారు పెద్దమ్మ. పనుల్లో ఎంత బిజీగా ఉన్నా ఇప్పటికి రోజుకు మూడుసార్లు తనను పలకరించి తిన్నానా..?ఏం చేస్తున్నాను..?ఏదైనా అవసరమా అడుగుతుందన్నారు.
అందుకే తాను ఎంతో ఎంతో అదృష్టవంతుడినని తెలిపిన సంతోష్…ఇప్పటివరకు నా జీవితంలో అత్యంత ప్రభావ వంతమైన ఇద్దరు మహిళల గురించి చెప్పాను ఇక నా సోదరీమణులు కవిత మరియు సౌమ్య గురించి ఖచ్చితంగా చెప్పాలి. ముఖ్యంగా కవిత…కేసీఆర్, కేటీఆర్ కన్నా స్మార్ట్. తాను ఎంతో పరిపక్వత కలిగిన రాజకీయ నాయకురాలని …తనకు ఏదైనా సందేహం ఉంటే కవితను సంప్రదించి సలహాలు తీసుకుంటానని తెలిపారు.
నా సోదరి సౌమ్య విద్యాపరంగా నిష్ణాతురాలు, కష్టపడి పనిచేసే స్వభాగం గల మహిళ. కొత్త పనులను నేర్చుకోవడంలో ఆసక్తిని కనబర్చుతుందని తెలిపారు. ఇక నా జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తి, నా నీడ, మద్దతు, జీవిత భాగస్వామి రోహిణి. ఆమె లేని ఈ వ్యాసం అసంపూర్ణంగా ఉంది. నేను రోహిణిని కలిసిన రోజు ఎప్పటికీ ప్రత్యేకమే.ఆమె టెక్కీ, రోహిణి నన్ను వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తుందా లేదా అని చాలా టెన్షన్ పడ్డాను అయితే ఆమె నన్ను వివాహం చేసుకోవడానికి అంగీకరించినప్పుడు, నా ఆనందానికి హద్దులు లేవు.
రోజు ఉదయం 6 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు పనిలో బిజీగా ఉండే తనకు రోహిణీ ఎంతో మద్దతిచ్చింది. ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ తనపై ఫిర్యాదు చేయలేదని కుటుంబాన్ని ముందుకు నడపడంలో ఆమె ఓ యోధురాలిలా కనిపిస్తుందన్నారు. నా కుమారులు ఇషాన్ మరియు శ్రేయాన్ ఇద్దరితో పాటు తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకుంటుంది, వారి ఆరోగ్యాన్ని ట్రాక్ చేస్తుందని తెలిపారు. మా కుటుంబానికి వెన్నెముకగా ఉండే రోహిణికి ధన్యవాదాలు అని తెలిపిన సంతోష్…వీరు మా కుటుంబంలోని మహిళలు, కానీ టిఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రం మరియు దేశంలోని ప్రతి స్త్రీకి నేను వందనం చేస్తున్నానని తెలిపారు.
తాను గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ప్రతిపాదించినప్పుడు, కుటుంబంతో పాటు మహిళల నుండి అపూర్వ మద్దతు లభించింది.. ప్రకృతి తల్లి విస్తరించిన సహనం మరియు రక్షణను స్త్రీ మాత్రమే అర్థం చేసుకోగలదన్నారు. అందేకే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతీ ఒక్క మహిళకు వందనం చేద్దాం అని పిలుపునిచ్చారు సంతోష్.