ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. నిసిగ్గుగా కడియం శ్రీహరి నిన్న స్పీకర్‌కు అఫిడవిట్ సమర్పించడంపై రాజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి తాను రాజీనామా చేయలేదని, కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోలేదని అఫిడవిట్‌లో పేర్కొనడం పూర్తిగా నీతిమాలిన చర్యగా అభివర్ణించారు. ప్రజల ముందు ఒకలా, స్పీకర్ ముందు మరోలా వ్యవహరించడం రాజకీయ విలువలకు విరుద్ధమని మండిపడ్డారు.
కడియం శ్రీహరి గతంలో చేసిన వ్యాఖ్యలు, రాజకీయ చర్యలు అందరికీ తెలుసని రాజయ్య గుర్తు చేశారు. పార్టీ మారిన తర్వాత కూడా నిజాలను దాచిపెట్టే ప్రయత్నం చేయడం సభ్య సమాజం సిగ్గుపడేలా ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో పారదర్శకత ఎంతో ముఖ్యమని, కానీ కడియం తన ప్రవర్తనతో మళ్లీ మళ్లీ తన నిజ స్వరూపాన్ని బయటపెడుతున్నాడని విమర్శించారు.
ఘనపూర్ నియోజకవర్గ ప్రజలు కడియం శ్రీహరిపై నమ్మకం ఉంచారని, ఆ నమ్మకాన్ని ద్రోహం చేసిన వ్యక్తిగా ఆయన చరిత్రలో నిలిచిపోతాడని రాజయ్య హెచ్చరించారు. ప్రజలకు నిజాలు చెప్పకుండా, అఫిడవిట్ల ద్వారా తప్పించుకునే ప్రయత్నం ఎంతకాలం సాగుతుందని ప్రశ్నించారు. “ఘనపూర్ ప్రజలకు ఇక నీ ముఖం ఎలా చూపిస్తావు?” అని ఘాటుగా ప్రశ్నిస్తూ, ప్రజలు ఈ మోసాన్ని క్షమించరని స్పష్టం చేశారు.
Also Read:పోషకాహార లోపం..ఇలా అధిగమిద్దాం!

