వరిదిగుబడిలో తెలంగాణ రాష్ట్రం పంజాబ్‌ను మించి పోయిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఆ ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే నని ఆయన కొనియాడారు. అమెరికాలో పర్యటిస్తున్న రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డితో వర్జీనియా రాష్ట్రం ఆల్డి నగరంలో ఏనుగు శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో యన్ఆర్ఐలు మీట్ అండ్ గ్రీట్ నిర్వహించారు. సుమారు 300 మంది యన్ఆర్ఐ లు ఇందులో పాల్గొన్నారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై యన్ఆర్ఐ లు సూటిగా అడిగిన ప్రశ్నలకు మంత్రి జగదీష్ రెడ్డి దీటుగా సమాధానమిచ్చారు.
యన్ఆర్ఐ డెవలప్మెంట్ ఫోరమ్‌కు చెందిన బొజ్జ అమరెందర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ వరి దిగుబడిలో రాష్ట్రం పంజాబ్‌ను మించిపోయిందన్నారు. రైతు పండించిన పంటను కొనుగోలు చేయడంలో కేంద్రం చేతులు ఎత్తేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ మానవీయ కోణంలో స్పందించి కొనుగోలు చేసిన విషయాన్ని మంత్రి జగదీష్ రెడ్డి గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టి అమలుపరిచిన మిషన్ భగీరథతో ఫ్లోరోసిస్ రహిత రాష్ట్రంగా తెలంగాణ మారిందన్నారు. కేంద్రప్రభుత్వ రంగ సంస్థలతో సహా దేశ విదేశీ సంస్థలు కితాబిచ్చాయన్నారు. టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టి స్వీయ నియంత్రణతో ప్రారంభించిన పథకం మిషన్ భగీరథ అన్నారు. ఇంతకు ముందెన్నడూ ఈ తరహా సాహసం చేయలేదన్నారు మంత్రి.
విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం యావత్ భారతదేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతకు అద్దం పడుతుందన్నారు.24 గంటల నిరంతర విద్యుత్ నందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ రికార్డులకెక్కిందన్నారు. అంతే గాకుండా వ్యవసాయానికి ఉచితంగా నాణ్యమైన విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.. ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన చెప్పారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ గడిచిన ఎనిమిది ఏండ్లుగా యావత్ భారతదేశానికి అభివృద్ధి నమూనాను అందిస్తున్న ముఖ్యమంత్రిగాఅద్భుతమైన పాలనను అందిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.
మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ ప్రగతిపై చర్చను నిర్వహించిన కార్యక్రమ నిర్వాహకులు ఏనుగు శ్రీనివాస రెడ్డిని మంత్రి జగదీష్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నంద్యాల దయాకర్ రెడ్డితో పాటు యన్ఆర్ఐ లు శ్రీనివాస రెడ్డి,మనోహర్,కాల్వల విషు,పాదురు శ్రవణ్, అమరెందర్ బొజ్జ, సుధా కొండరాపు, బాబు రావు,తదితరులు పాల్గొన్నారు.