పట్టాభిషేకానికి నాలుగు రోజుల ముందు థాయ్ రాజు మహా వజిరలాంగ్‌కోర్న్ ఆ దేశ ప్రజలను ఆశ్చర్యపరిచే నిర్ణయం తీసుకున్నారు. తన వ్యక్తిగత బాడీగార్డ్ విభాగానికి డిప్యూటీ చీఫ్‌గా వ్యవహరిస్తోన్న సుతిదను పెళ్లాడారు. అంతేకాదు ఆమెకు రాణి హోదాను కట్టబెట్టారు. థాయ్ రాజు బాడీగార్డ్ డిప్యూటీ చీఫ్‌ను పెళ్లాడిన వార్త వెల్లడించిన థాయ్ రాయల్ గెజిట్.. వారి పెళ్లి ఫొటోలను, వీడియోలను విడుదల చేసింది. దీంతో ఆ దేశ ప్రజలందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు.
థాయ్ చక్రవర్తిగా 66 ఏళ్లపటు పరిపాలించిన మహా వజిరలాంగ్‌కోర్న్ తండ్రి కింగ్ రామాXగా పిలవబడే భూమిబోల్ అదుల్‌యదెజ్ 2016 అక్టోబర్‌లో మరణించడంతో ఆయన వారసుడిగా వజిరలాంగ్‌కోర్నను రాజుగా ప్రకటించారు. వచ్చే శనివారం బ్యాంకాక్‌లో బౌద్ధ, బ్రాహ్మణ సంప్రదాయ వేడుకల ప్రకారం ఆయన థాయ్‌లాండ్ రాజుగా పట్టాభిషక్తుడు కానున్నారు. ఆ మరునాడు అధికారికంగా ఆయన రాజుగా ఊరేగింపులో పాల్గొంటారు. రాజుగా పట్టాభిషేకాన్ని చేసుకోనున్న తరుణంలో ఆయన వివాహం చేసుకొన్నారు.
కాగా గతంలో వజిరలాంగ్‌కోర్‌కు మూడు వివాహాలు జరగగా.. ఏడుగురు సంతానం ఉన్నారు. మొదట పెళ్లాడిన ముగ్గురితోనూ ఆయన విడాకులు తీసుకున్నారు. గతంలోకి వెళితే.. థాయ్ ఎయిర్‌వేస్‌లో ఫ్లయిట్ అటెండెంట్‌గా పనిచేస్తోన్న సుతిదను వజిరలాంగ్‌కోర్న్ 2014లో తన బాడీగార్డుల్లో డిప్యూటీ కమాండెంట్‌గా నియమించుకున్నారు. అంతకుముందు ఓ విమానంలో ఆమెను చూసి మనసుపడ్డ వజిరలోంగ్.. ఇన్నాళ్లకు ఆమెను భార్యగా చేసుకున్నాడు.