ప్రభాస్ హీరోగా నటించిన ఫాంటసీ హారర్ కామెడీ చిత్రం ‘ది రాజా సాబ్’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. సుమారు రూ.400 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. తాజాగా తన తదుపరి చిత్రం ‘గరివిడి లక్ష్మి’ ప్రమోషన్లలో పాల్గొన్న నిర్మాత టీజీ విశ్వప్రసాద్.. ‘ది రాజా సాబ్’ వైఫల్యానికి గల కారణాలపై స్పందించారు.
ఓ మీడియా సమావేశంలో సంక్రాంతి సీజన్లో విడుదల చేయడం తమ ప్రాథమిక తప్పిదాల్లో ఒకటని ఆయన అభిప్రాయపడ్డారు. మరో సమయంలో సినిమాను విడుదల చేసి ఉంటే ఫలితం భిన్నంగా ఉండేదని పేర్కొన్నారు. ది రాజా సాబ్ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశాం. అయితే, సంక్రాంతి సీజన్లో విడుదల చేయడం, ఇతర అంశాలు కూడా సినిమా ఫలితంపై ప్రభావం చూపించాయి అని విశ్వప్రసాద్ వెల్లడించారు.
సంక్రాంతి విడుదలతో పాటు సినిమా ప్రీమియర్లు ఆలస్యం కావడం, టికెట్ ధరలను పెంచేందుకు ప్రయత్నించడం కూడా ప్రతికూల ప్రభావం చూపించాయని నిర్మాత తెలిపారు. సినిమా విడుదలైన రోజున ప్రీమియర్లు ఆలస్యమయ్యాయి. టికెట్ ధరలను పెంచేందుకు కూడా ప్రయత్నించాం. మా నిర్మాణ సంస్థ తరఫున ఓ సినిమా టికెట్ ధరలను పెంచాలని ప్రయత్నించడం బహుశా ఇదే మొదటిసారి. అలా చేసి ఉండకూడదు. దాని వల్ల ఆలస్యం జరిగింది. ప్రేక్షకులు అసహనానికి గురయ్యారు. సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి అని ఆయన వివరించారు.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ప్రభాస్ చిత్రం ‘స్పిరిట్’తో ‘ది రాజా సాబ్’ పరాజయాన్ని భర్తీ చేస్తారా? అని మీడియా ప్రశ్నించగా విశ్వప్రసాద్ స్పందించారు. తాను ‘స్పిరిట్’ చిత్రానికి కేవలం డిస్ట్రిబ్యూటర్గా మాత్రమే వ్యవహరిస్తున్నానని స్పష్టం చేశారు.
మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది రాజా సాబ్’లో ప్రభాస్ ప్రధాన పాత్ర పోషించారు. సంజయ్ దత్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, జరీనా వహాబ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. 2024 జనవరి 9న సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైంది. భారీ బడ్జెట్తో తెరకెక్కినప్పటికీ, సినిమా అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది.
Also Read:ది ట్రైటర్స్ తెలుగు..క్లోక్మెన్ సందడి

