రష్యా అందల తార మరియా షరపోవా టెన్నిస్‌కు గుడ్ బై చెప్పింది. కొంతకాలంగా గాయాలతో సతమతమవుతున్న షరపోవా బుధవారం రిటైర్మెంట్ ప్రకటించింది. 19 ఏళ్ల ఆమె కెరీర్లో ఐదుసార్లు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను సాధించింది. టెన్నిస్‌కు వీడ్కోలు ప్రకటించేందుకు ఇదే సరైన సమయమని పేర్కొంది షరపోవా.
టెన్నిస్ తనకెంతో ఇచ్చిందని, ఇకమీదట ఆటను ఎంతగానో మిస్ అవుతానని వ్యాఖ్యానించింది. టెన్నిస్ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలను ఎదుర్కొన్నానని ..ఒకసారి శిఖరంపైకి చేరాక అక్కడినుంచి ప్రపంచమంతా అద్భుతంగా కనిపించిందని తెలిపింది.
2004లో వింబుల్డన్ మహిళల సింగిల్స్ టోర్నీ సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. 17 ఏళ్ల ప్రాయంలో దిగ్గజం అమెరికాకు చెందిన సెరెనా విలియమ్స్ ను ఓడించిన షరపోవా 19 ఏళ్ల పాటు తన కెరీర్ ను కొనసాగించింది.ఒకదశలో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకు సాధించిన షరపోవా.. ప్రస్తుతం 373వ ర్యాంకులో కొనసాగుతోంది. 2016 ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాత డ్రగ్ టెస్టులో విఫలమై 15 నెలలపాటు నిషేధానికి గురైంది.