మళ్లీ బ్యాట్‌ పట్టనున్న సచిన్-సెహ్వాగ్..!

457
sachin
- Advertisement -

క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మాజీలతో కొత్త లీగ్‌ నిర్వహణకు రంగం సిద్ధమైంది. రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌ టి20 లీగ్‌ పేరుతో ఈ టోర్నీ జరుగుతుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 నుంచి 16 వరకు ఈ టోర్నీ ముంబై, పుణే వేదికగా జరుగుతుంది. ఈ టోర్నీ వివరాలను తాజాగా ప్రకటించారు. ఈ సిరీస్‌లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మరోసారి ఇండియా తరఫున ఓపెనింగ్ జోడీగా దిగి, క్రికెట్ మ్యాచ్ లు ఆడనున్నారు.

sachin

సచిన్‌ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, తిలక రత్నే దిల్షాన్, బ్రెట్‌ లీ, జాంటీ రోడ్స్‌, బ్రియాన్‌ లారా తదితర ఎంతో మంది నిన్నటి తరం స్టార్ క్రికెటర్లు ఈ పోటీల్లో పాల్గొంటారు. ఇండియా లెజెండ్స్, ఆస్ట్రేలియా లెజెండ్స్, దక్షణాఫ్రికా లెజెండ్స్, శ్రీలంక లెజెండ్స్, వెస్టిండీస్‌ లెజెండ్స్‌గా ఐదు జట్లు పోటీలో ఉంటాయి. మొత్తం 75 మంది వరకూ రిటైర్డ్‌ క్రికెటర్లు ఇందులో ఆడతారు. లీగ్ లో భాగంగా 10 మ్యాచ్‌ లు, ఆపై టాప్-2లో నిలిచిన జట్ల మధ్య ఫైనల్ పోటీ ఉంటుంది.

ఇక ఇండియా జట్టు సచిన్ కెప్టెన్సీలో ఆడనుండగా, సెహ్వాగ్, జహీర్ ఖాన్ తదితరులు కూడా ఉంటారు. వెస్టిండీస్ జట్టుకు బ్రియాన్‌ లారా, దక్షిణాఫ్రికాకు జాంటీ రోడ్స్, శ్రీలంకకు దిల్షాన్, ఆస్ట్రేలియాకు బ్రెట్‌ లీ నాయకత్వం వహిస్తారు. ఈ పోటీల ద్వారా వచ్చే ఆదాయంలో కొంత మొత్తాన్ని రోడ్డు భద్రత అవగాహనా కార్యక్రమాలు నిర్వహించే ‘శాంత్‌ భారత్‌-సురక్షిత్‌ భారత్‌’ సంస్థకు విరాళంగా ఇవ్వనున్నారు.

- Advertisement -