అతడు సినిమాలో తనికెళ్ల భరణి ఓ డైలాంగ్ అంటాడు. ‘అక్కడా ఇక్కడా ఎందుకురా బుజ్జా.. గుడి ముందు వేసేస్తే అమ్మ ఆశీర్వాదం కూడా ఉంటుంది. ఈ డైలాగ్ ను కొంతమంది అక్రమార్కులు ఫాలోఅవుతున్నారు. ప్రధాని మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంతో నల్ల దొంగలకు తమ దగ్గరున్న సొమ్మును ఏం చేయాలో పాలుపోవడం లేదు. కొందరు తగలబెడుతుంటే, మరికొందరు నీళ్లలో పడేస్తున్నారు.
ఇంకొందరు నోట్లను బస్తాల్లో కుక్కి చెత్తకుప్పల్లోకి విసిరేస్తున్నారు. ఏ ఆధారాలు దొరకకుండా చేయడానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకాస్త వెరైటీగా ఆలోచించేవాళ్లు మాత్రం దేవుడిని వాడేసుకుంటున్నారు. పాపము సొమ్మును దేవుడి హుండిలో వేసి కొంచెం పుణ్యమైనా దక్కించుకునేందుకు అక్రమ పాత నోట్ల కట్టలను దేవుడి హుండిలో వేస్తున్నారు. దీంతో తెలుగు రాష్ట్ర్రాల్లోని దేవయాలకు గతంలో ఎప్పుడు లేనంతగా ఆదాయం వచ్చిపడుతుందట.
కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.వెయ్యి నోట్లను రద్దు చేయడంతో దేవుళ్ల హుండీకీ డిమాండ్ పెరిగింది. చాలామంది భక్తులు రద్దైన రూ. 500, రూ. వెయ్యి నోట్లను హుండీలో కానుకలుగా సమర్పిస్తున్నారు. దీంతో అన్నీ ఆలయాల హుండీలు పాత నోట్ల కట్టలతో కళకళలాడుతున్నాయి. తాజాగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ హుండీలో ఇద్దరు అజ్ఞాత వ్యక్తులు లక్షల్లో పాత నోట్లను వేశారు. ఓ వ్యక్తి రూ.500, రూ. వెయ్యి నోట్లతో రూ.4.50 లక్షలు, మరో అజ్ఞాత వ్యక్తి పాత రూ.వెయ్యి నోట్లతో లక్ష రూపాయలను హుండీలో వేయడం సంచలనం కలిగించింది. ఆలయ హుండీని తెరచిన,,దేవస్థానం అధికారులు ఈ విషయాన్ని గుర్తించి తెలియజేశారు. మొత్తానికి నల్లకుబేరులు ఈ విధంగా పాపాన్ని తగ్గించుకుంటున్నారు.
నోట్ల రద్దుతో తిరుమల తిరుపతికి గత వారం రోజుల నుంచి భక్తుల సంఖ్య తగ్గుతున్నా.. ఆదాయం మాత్రం పెరుగుతోంది. ఇలా జరగడానికి గల కారణాలు ఏంటని టీటీడీ అధికారులు పరిశీలించారు. వాళ్ల పరిశీలనలో ఆశ్చర్యాన్ని కలిగించే విషయాలు తెలిశాయట. హుండీలో వేసిన పాత నోట్లను లెక్కపెట్టలేక పోతున్నామని ఉద్యోగస్థులే చేతులెత్తేశారు. మూడునాలుగు రోజుల్లోనే ఏడాదిలో వచ్చేంత ఆదాయం శ్రీవారి హుండీ రూపంలో వచ్చి పడిందట. ఆ హుండీలను చూసిన టీటీడీ అధికారులు బిత్తరపోతున్నారట.
తెలుగు రాష్ట్ర్రాలతో పాటు,,పక్కరాష్ట్ర్రామైన తమిళనాడులోని వెల్లూరు శ్రీ జలకంఠేశ్వర స్వామి ఆలయంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. పాపపు సొమ్మును అక్కడాఇక్కడా పడేయడమెందుకు దేవుడి హుండీలో వేస్తే కాస్త పుణ్యమన్నా వస్తుందనుకున్నాడో ఏమో. 44 లక్షల రూపాయల డబ్బును దేవుడి హుండీలో వేశాడు. ఆలయ సిబ్బంది హుండీ లెక్కింపుతో ఈ బాగోతం వెలుగులోకి వచ్చింది.
ఆదాయాన్ని లెక్క చూసేందుకు హుండీని తెరిచిన ఆలయ సిబ్బందికి నోట్ల కట్టలు చూసి కళ్లు బైర్లుకమ్మాయి. వెంటనే పోలీసులకు సమాచారమందించారు. ఆ నోట్ల విలువను లెక్కకడితే 44,33,473 రూపాయలుగా తేలింది. మొత్తం 58 బండిల్స్ బయటపడగా అందులో 30 దాకా వెయ్యి రూపాయల కట్టలు, 28 దాకా ఐదు వందల నోట్ల కట్టలు లెక్కతేలాయి. ఆలయానికి రోజువారీ వచ్చే ఆదాయం 5 నుంచి 10వేల మధ్యలో ఉంటుందని, కానీ ఇంత మొత్తంలో డబ్బు రావడం ఇదే తొలిసారి అని ఆలయ అధికారులు ఆశ్చర్యపోతున్నారు.